హావిూల అమలులో నిర్లక్ష్యం: తాహిర్‌ బిన్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):  తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీలకు బుద్ధి చెప్పాలని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ పిలుపునిచ్చారు.  కేవలం సోనియా గాంధీ ధృడసంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అయితే దానిని తన కుటంబ అధికారం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కేసీఆర్‌, మోదీ ఎన్నో అబద్దపు వాగ్ధానాలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేవిూ లేదని ఆయన విమర్శించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ సర్కార్‌ నేడు రైతులను మోసం చేస్తోందని  విమర్శించారు. కాంగ్రెస్‌ మరిన్ని ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వ అక్రమాలను ఎండగడతామని అన్నారు. సర్కార్‌కు ఇది కనువిప్పు కావాలన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల దండుకోవడానికే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ చేపట్టారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి రంగంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించామని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హావిూలన్నీ ఏమయ్యాయని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల్ని దారుణంగా మోసపుచ్చిందని  ఆరోపించారు. ఎన్నికల హావిూల్ని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఒకలా, ప్రభుత్వం ఏర్పాటయ్యాక మరోలా మాట్లాడు తోందని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణమాఫీ అంశంపై టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ పోరాడుతుందని  విరుచుకుపడ్డారు. తప్పుడు హావిూల వల్లే కేసీఆర్‌ తెలంగాణకు సీఎం అయ్యారని అన్నారు. కేసీఆర్‌ తరహాలో తాము కూడా మోసపూరిత హావిూలు ఇచ్చి ఉంటే నేడు కాంగ్రెస్‌ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదని  అభిప్రాయపడ్డారు.