హిమాచల్‌లో భారీ వర్షాలు

వరదల్లో కొట్టుకు పోయిన ట్రక్కు, వోల్వో బస్సు
సిమ్లా,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో బియాస్‌ నది పొంగిపొర్లుతోంది. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. పలుచోట్ల వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. మండి జిల్లాలో జాతీయ రహదారిపైకి బియాస్‌ నది వరద రావడంతో రాకపోకలను నిలిపివేశారు. కులు ప్రాంతంలో వరద ధాటికి ఓ ట్రక్కు కొట్టుకుపోయింది. మనాలీ ప్రాంతంలో ఓ వోల్వో బస్సు వరద నీటిలో కొట్టుకుపోయింది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు, లహాల్‌-స్పితి జిల్లాలోని కీలాన్‌ ప్రాంతంలో దట్టంగా మంచు కురిసింది.
ఆజ్మీర్‌లో భారీ వర్షాలు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌ను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఓ బ్రిడ్జి అండర్‌ పాస్‌ లో నిల్వ ఉన్న వరద నీటిలో పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. ఈ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులున్నారు. అప్రమత్తమైన అధికారులు.. వరదలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్థులకు ఎలాంటి హానీ కలగలేదు. దీంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.