హిల్లరీకి 20 మిలియన్‌ డాలర్ల విరాళం

1

– ట్రంప్‌ను ఓడించేందుకు ఫేస్‌బుక్‌ నిర్ణయం

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అమెరికా అధ్యక్షపదవికి డెమొక్రటిక్‌ పార్టీ తరఫు నుంచి పోటీలో వున్న హిల్లరీ క్లింటన్‌ కు సోషల్‌ విూడియా దిగ్గజం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఫేస్‌ బుక్‌ సహ వ్యవస్థాపకుడు డస్టిన్‌ మొస్కొవిట్జ్‌ ఓ ప్రకటన చేశారు. తాను, తన భార్య కరి కలిసి డెమొక్రటిక్‌ పార్టీకి 20 మిలియన్‌ డాలర్లు(రూ.134 కోట్లు) భారీ విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారుఅమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఓ స్వతంత్ర వ్యక్తిగా, ఒక దేశంగా, ఒక సమాజంగా ఎలా ఉండాలని మనం నిర్ణయించుకోబోతున్నామో నవంబర్‌ లో జరగనున్న ఎన్నికల్లో తెలుస్తుందని ఆయన తన బ్లాగ్‌ లో రాసుకొచ్చారు. తను, తన భార్య కలిసి ఓ పార్టీ అభ్యర్ధికి బాసటగా నిలుస్తూ, విరాళం ఇవ్వడం ఇదే మొదటిసారి అని తెలిపారు.రిపబ్లికన్‌ పార్టీ, ఆ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌ లు ఎన్నికల ప్రచారంలో గుడ్డిగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. ఇమిగ్రేషన్‌ పై రిపబ్లికన్‌ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో అమెరికన్లు, ఇతర దేశాల పౌరులను బాధిస్తాయని డస్టిన్‌ తన బ్లాగులో రాసుకొచ్చారు. క్లింటన్‌ కు తాను చేస్తున్న చిన్నసాయం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.