హెచ్‌-4 వీసాను కాపాడాలి


– లేకుంటే ప్రతిభావంతులు వెళ్లిపోతారు
– అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు పెట్టిన ఇద్దరు శాసన సభ్యులు
వాషింగ్టన్‌, నవంబర్‌17(జ‌నంసాక్షి) : హెచ్‌-4వీసాతో జీవిత భాగస్వాములకు లభిస్తున్న పని అనుమతిని తొలగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవితభాగస్వామికి ఇచ్చే హెచ్‌-4వీసాను కాపాడాలని ఇద్దరు శాసనసభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే ఈ సదుపాయం తీసేయడం వల్ల ఎంతో మంది ప్రతిభావంతులు దేశం విడిచి వెళ్లే అవకాశముందని, లేదంటే కుటుంబాలు విడిపోయే
ప్రమాదముందని తెలిపారు. అలా జరిగితే వారి తెలివితేటలను అమెరికాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారని బిల్లులో పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో పనిచేయొచ్చునని, వారి జీవిత భాగస్వాములకు హెచ్‌-4 వీసా ద్వారా పని అనుమతి లభిస్తుందని, హెచ్‌-4 వీసాను రద్దు చేస్తే ఆ ప్రభావం చాలా మంది వలసదారులపై పడుతుందని, దాన్ని రద్దు చెయ్యొద్దని కోరుతూ శాసనకర్తలు అన్నా జీ ఎషో, జోయ్‌ లాఫ్‌గ్రెన్‌లు కాంగ్రెస్‌లో ‘హెచ్‌-4 ఎంఎ/-లాయిమెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ బిల్లును ప్రవేశపెట్టారు.
హెచ్‌-4వీసా ప్రవేశపెట్టినప్పటి నుంచి దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలు పొందారని, వారిలో ఎక్కువగా భారతీయులు, అందులోనూ మహిళలు ఎక్కువగా ఉన్నారని బిల్లు ప్రవేశపెట్టిన శాసనసభ్యులు తెలిపారు. వారు అమెరికాలో పోటీతత్వాన్ని పెంచడమే కాకుండా, వేలాది మంది హెచ్‌-1బీ ఉద్యోగులపై, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నారని వెల్లడించారు. ఈ సదుపాయం తొలగిస్తే చాలా మంది వలసదారులు దేశం విడిచి వెళ్లిపోతారని, లేదంటే కుటుంబాలు విడిపోవాల్సిన బాధాకర పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. వారు అమెరికా వదిలి వెళ్లిపోతే వారి ప్రతిభను అమెరికా వ్యాపారానికి విరుద్ధంగా ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ఆర్థిక అవసరాలతో పాటు కుటుంబాలను కలిపి ఉంచేందుకు హెచ్‌-4 వీసాను కాపాడాలని అభిప్రాయపడ్డారు. హెచ్‌-4 వీసా రద్దు చేయడం వల్ల మన దేశానికి వచ్చే లాభమేవిూ ఉండదని, దాన్ని కొనసాగిస్తేనే ఎంతో మంది ప్రతిభ మన దేశానికి ఉపయోగపడుతుందని మరో నేత తెలిపారు.