హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్న ఇసి

తెలంగాణ ప్రభుత్వం చెప్పుచేతల్లో కీలుబొమ్మ: మర్రి

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణలో ఓటర్ల జాబితా సవరించకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈసీ కోర్టును తప్పుదోవపట్టిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాను సరిచేయకుండా తప్పులను సమర్థించేలా ఎన్నికల సంఘం మొండిగా ముందుకెళుతూ ఓ అసమర్థ సంఘంగా మారిందని మండిపడ్డారు. ఈసీ దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎన్నికలను ఈసీ నిష్పక్షపాతంగా జరపగలుగుతుందా అనే అనుమానం ప్రజల్లో ఉందని.. ఇలాంటి పరిణామాలతో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంపోయే ప్రమాదం ఉందని శశిధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుకు వెళితేనే పరిస్థితి ఇలా ఉందని, లేకపోతే ఇంకెంత దారుణంగా ఉండేదోనని అనుమానం వ్యక్తం చేశారు. తెరాస చెప్పుచేతుల్లో ఎన్నికల సంఘం పనిచేస్తోందని మరోమారు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇవాళ కోర్టుకు అదనంగా నాలుగో ఆఫిడవిట్‌ దాఖలు చేశానని అది ఎల్లుండి విచారణకు వస్తుందని ఆయన చెప్పారు.