హైదరాబాద్‌లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం.. 1,800 మందికి ఉద్యోగాలు

 

 

 

 

 

హైద‌రాబాద్ : ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) తన గ్లోబల్ క్యాప‌బిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం ద్వారా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న తన కార్యకలాపాలకు నాలెడ్జ్ సర్వీసెస్‌ని అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రంలో తొలుత 800 మంది ఉద్యోగులు పనిచేస్తారని, తర్వాత దశలవారీగా వీరి సంఖ్యను 1800కు పెంచనున్నట్లు సంస్థ తెలిపింది. శాండోస్ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమై ఈ మేరకు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటును ప్రకటించింది. ఈ సందర్భంగా శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రంను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లాబోరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.