100 స్థానాల్లో తెరాసదే గెలుపు

– అమిత్‌ షా తెలంగాణలో షో చేస్తున్నారు
– కాంగ్రెస్‌ నేతలు దేశద్రోహులు
– ఆపద్దర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
– తెరాస భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన నాయిని
హైదరాబాద్‌, సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి ) : వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెరాసకే అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, 100 స్థానాల్లో తెరాస జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తయని స్పష్టం చేశారు. మహాకూటమిని తెలంగాణ
ప్రజలు విస్మరిస్తారన్నారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఏం పని నాయిని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఉద్దేశంతో బాబు ఉన్నారని, ఆయన ఆటలు సాగవని తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని అన్నారు. నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంతో ఉన్నారని,  రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని నాయిని తెలిపారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే కిషన్‌రెడ్డి పారిపోయిండని మండిపడ్డారు. టీ కాంగ్రెస్‌ నేతలు దేశ ద్రోహులన్నారు. అమిత్‌ షా తెలంగాణలో గెలుస్తమని షో చేస్తున్నరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీతోపాటు పలువురు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.