13 నిమిషాలు.. అన్నీ అబద్ధాలు!

వాషింగ్టన్‌: ‘ఫర్ 13 మినిట్స్‌ స్ట్రయిట్‌’ పేరిట తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఒకటి డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటికే 70లక్షలమందికిపైగా చూశారు. గే పెళ్లిలు మొదలుకొని వాల్‌స్ట్రీట్‌ వరకు విధానపరమైన అంశాల్లో హిల్లరీ చెప్పిన అబద్ధాలు, వైఖరి మార్చుకున్న సందర్భాలను గూదిగుచ్చి ఈ వీడియోలో చూపించారు. అమెరికాకు సంబంధించిన విధానపరమైన అంశాల్లోనూ వివిధ సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలను ఒకచోట చేర్చి ఈ వీడియోను ఓ గుర్తుతెలియని వ్యక్తి పోస్టు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున నామినేషన్‌ సాధించడానికి తీవ్రంగా పోటీపడుతున్న హిల్లరీ ఇటీవల కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్నారు. రాష్ట్రాల ప్రైమరీలో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఆమె ప్రత్యర్థి బెర్నీ సాండర్స్‌ గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలుగుచూసిన ఈ వీడియో ఆమెను మరింత దెబ్బతీసే అవకాశముంది. గే వివాహం విషయంలో 2004, 2010లో సంప్రదాయవాదులకు మద్దతుగా వాదన వినిపించిన ఆమె ఆ తర్వాత తన వైఖరి మార్చుకున్నారు. గే వివాహాలకు మద్దతు పలికారని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఇది రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అనుకూల వీడియో కాదని, త్వరలోనే ఆయన అబద్ధాలను కూడా బట్టబయలు చేస్తామని వీడియో రూపకర్తలు మొదట్లో తెలిపారు.