17న కేసీఆర్‌ జన్మదినం

– జలవిహార్‌లో వేడుకలకు భారీ ఏర్పాట్లు
– ఏర్పాట్లను పరిశీలించిన తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : తెలంగాణ సీఎం, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈనెల 17న  పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేడుకలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జలవిహార్‌లో ఏర్పాట్లను మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ¬మాలు, యజ్ఞాలు, కేసీఆర్‌ చిన్ననాటి విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జలవిహార్‌లో సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుతామన్నారు. హమాలీ బస్తీలో రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. జలవిహార్‌లో కళాకారులతో వివిధ కళారూపాల ప్రదర్శన ఉంటుందని తలసాని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై రూపొందించిన రెండు పాటలను విడుదల చేస్తామన్నారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ వేడుకలకు పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆహ్వానితులేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా జరిగే చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ కవిత హాజరవుతారని తలసాని వెల్లడించారు. ఈ వేడుకలకు కేటీఆర్‌, హరీష్‌ రావులు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారన్నారు. అలాగే తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస నేతలు సిద్ధమవుతున్నారు.