18న మంత్రి కేటీఆర్‌నుకలువనున్న నేతలు

నగరపంచాయితీ కోసం స్టేషన్‌ ఘనాపూర్‌ ఎదురుచూపు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్‌ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్‌ ఘనాపూర్‌ను నగరపంచాయితీగా మార్చాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీనిపై స్థానిక టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్యతో చర్చించారు. శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, ఇదొక మంచి అవకాశంగా వారు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే టీ రాజయ్య సైతం సానుకూలత వ్యక్తం చేసారు. దీంతో ఈనెల 18న మంత్రి కేటీఆర్‌ ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఆయనను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయనతో పురపాలికగా మార్చే అంశాన్ని చర్చించాలని నిర్ణయించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ మేజర్‌ గ్రామపంచాయతీ పురపాలక సంఘంగా మారితే అభివృద్ధి పెద్దఎత్తున జరిగి ప్రజలకు మౌలిక సౌకర్యాలు పెరుగుతాయని ప్రస్తుత సర్పంచ్‌ ఇల్లందుల ప్రతాప్‌ అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో స్టేషన్‌ఘన్‌పూర్‌ రెవెన్యూ డివిజన్‌ కేంద్రం కావడం, దీనికి తోడు పురపాలక సంఘంగా మారితే స్టేషన్‌ఘన్‌పూర్‌ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం నుంచి పురపాలక సంఘానికి నేరుగా నిధులు చేరే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులను అందించే అవకాశం ఉంది. పురపాలక సంఘం మంజూరు కోసం ఘన్‌పూర్‌, శివునిపల్లి గ్రామాల ప్రజా ప్రతినిధులు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రాన్ని

అందిస్తామని అన్నారు. మేజర్‌ గ్రామపంచాయతీల్లో 15వేలు జనాభా దాటిన వాటిని పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. సంబంధిత మేజర్‌ గ్రామపంచాయతీల్లో ఐదు కిలోవిూటర్ల పరిధిలోని గ్రామాలను విలీనం చేయాలని సూచించారు. అధికారుల వద్ద సమాచారం మేరకు రాష్ట్రంలో 40పురపాలక సంఘాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అత్యధిక జనాభా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌ నగర పంచాయతీగా ఏర్పడే అవకాశాలున్నాయి. గతంలో మేజర్‌ పంచాయతీ 20వేల జనాభాకు పైబడి ఉంటేనే నగరపంచాయతీలుగా మార్చేవారు. నిబంధనలను సడలించిన ప్రభుత్వం ప్రస్తుతం 15వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చేందుకు నిర్ణయం తీసుకుంది. శాసనసభ నియోజక వర్గం కేంద్రంగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో 12,721మంది ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు.. ఈ జనాభా సరిపోతున్నందున స్టేషన్‌ఘన్‌పూర్‌ నగర పంచాయతీగా మార్చేందుకు ఎలాంటి సమస్యలు లేవని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. అవసరమైతే సవిూపంలోని ఛాగల్లు గ్రామాన్ని కలిపితే ఇక్కడి 4,520 జనాభా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కలిసి 22వేలు జనాభా దాటుతుందని పేర్కొంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు సంబంధిత అధికారులు స్టేషన్‌ఘన్‌పూర్‌ను పురపాలక సంఘంగా మార్చాలని కోరుతున్నారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఉన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజక వర్గ కేంద్రం క్రమంగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాల పునర్విభజన అనంతరం జనగామ జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ముఖ్య పట్టణంగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా ఏర్పడింది. జనాభా ఉన్నందున పురపాలక సంఘంగా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు. రాష్ట్ర రాజధానిని కలిపే రైల్వే స్టేషన్‌ ఇక్కడ ఉండడం మరో మంచి అవకాశమని చెబుతున్నారు.