2019నాటికి చమురు ఉత్పత్తుల్లో 

అతిపెద్ద దేశంగా అమెరికా!
– యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్టేష్రన్‌ అంచనా
వాషింగ్టన్‌, జులై14(జ‌నం సాక్షి) : వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలోనే అత్యధిక చమురును ఉత్పత్తి చేసే దేశంగా అగ్రరాజ్యం అమెరికా అవతరించనుందా..? చమురు ఉత్పత్తిలో అమెరికా త్వరలోనే సౌదీ అరేబియా, రష్యాలను దాటేస్తుందా అంటే అవునని యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్టష్రన్‌ అంచనా వేస్తోంది. 2019 నాటికి రోజుకు 11.8 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురును ఉత్పత్తి చేసే స్థాయికి అమెరికా చేరుకుంటుందని చెబుతోంది. అదే నిజమైతే అమెరికా ఈ మైలురాయిని అందుకోవడం నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి అవుతుంది. 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ చమురును ఉత్పత్తి చేసే దేశంగా అమెరికా తొలిస్థానంలో ఉంది. అయితే 1974లో సోవియెట్‌ యూనియన్‌ అమెరికాను దాటేసి చమురు ఉత్పత్తిలో అగ్రస్థానానికి వెళ్లింది. ఆ తర్వాత 1976లో సౌదీ అరేబియా చమురును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశంగా అవతరించింది. అయితే గత కొంతకాలంగా అమెరికా తమ చమురు ఉత్పత్తి విధానాల్లో మార్పులు చేపట్టింది. అనేక కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఇవి చమురు ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడుతున్నాయని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. యూఎస్‌ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. గతేడాది రష్యా రోజుకు 10.3 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురును ఉత్పత్తి చేయగా.. సౌదీ అరేబియా 10 మిలియన్‌ బ్యారెల్స్‌, అమెరికా 9.4 బ్యారెల్స్‌ ఉత్పత్తి చేశాయి. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమెరికాలో చమురు ఉత్పత్తి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ దేశంలో మే నెలలో రోజుకు 10.8మిలియన్‌ బ్యారెల్స్‌, జూన్‌లో 10.9 మిలియన్‌ బ్యారెల్స్‌ చమురును ఉత్పత్తి చేసినట్లు అక్కడి గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదేవిధంగా కొనసాగితే 2019 నాటికి రోజుకు 11.8 మిలియన్‌ బ్యారెల్స్‌ ఉత్పత్తి చేస్తే స్థాయికి అమెరికా చేరుకుంటుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.