22న ఓటరు జాబితా విడుదల

జనగామ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఈనెల 22న విడుదల చేస్తారు. అనంతరం ఓటర్‌ కార్డుల్లో తప్పులను సరి చేసుకునేందుకు, మార్పులు చేర్పులతో పాటు నూతన ఓటర్‌ నమోదు  ఉంటుంది. ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఇది అందుబాటులో ఉంటుందని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణాడ్డి తెలిపారు. దీనికితోడు రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల పక్రియకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు  తెలిపారు. ఓటరు లిస్టులో పేర్లులేని అభ్యర్థులు 22నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల పక్రియలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన పోలింగ్‌ బూత్‌ల ఈవీఎంల పరిశీలన పూర్తి అయినట్లు తెలిపారు. కాగా, జనగామ ఈవీఎంలపై హైకోర్టు స్టే ఉన్నందున వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికలకు జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల పక్రియలో ఆర్డీవోలు ఏఆర్వోలుగా వ్యవహరిస్తారని, నోడ ల్‌ అధికారులను త్వరలోనే నియమిస్తారని తెలిపారు. ఇక ఓటర్‌ కార్డుల సమస్యలను, ఎన్నికల సమాచారం తెలుసుకునేందుకు జిల్లా కేంద్రం లో 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉందన్నారు.