23న మరోమారు రైతుల ఆందోళన

ఎర్రజొన్న,పసుపు పంటలకు గిట్టుబాటు ధరలకు డిమాండ్‌
నిజామాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్ధతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ రైతుసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేతలు ఆరోపించారు. గ్రామాలలో 144 సెక్షన్‌ విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 23వ తేదీన జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం చేయాలని ఐక్యకార్యాచరణ కమిటీ నిర్ణయించిందన్నారు. స్వామినాథన్‌ సిఫారస్సుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్లపై వచ్చి ధర్నాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. పసుపు పండించే రైతులకు క్వింటాలుకు రూ.15 వేలు ఉండాలని కోరారు. ఈ నెల 23న రైతు సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలలో  రైతులంతా పాల్గొంటారని తెలిపారు.