24గంటల కరెంట్‌తో పెరిగిన ఒత్తిడి?

వ్యవసాయానికి, గృహావసరాలకు వేర్వేరుగా సరఫరా

పరిశీలిస్తున్న అధికారులు

మెదక్‌,జూలై17(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో 24గంటల ఉచిత వ్యవసాయ కరెంట్‌ సాకారం అవుతున్న వేళ పెండింగ్‌ దరఖాస్తులపై రైతులు ఆశగా చూస్తున్నారు. కేవలం కొన్ని దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లోఉన్నాయని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు. పెండింగ్‌ దరఖాస్తులను క్లీయర్‌ చేసి త్వరలోనే కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. 24 గంటలూ విద్యుత్తును అందించడంతో రైతులు విద్యుత్‌ కోసం చూస్తున్నారు. దీనివల్ల ప్రధానంగా భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడనుంది. అవసరాలకు మించి నీటిని తోడేసే ప్రమాదం ఉంది. ట్రాన్స్‌ఫార్మర్లపైనా భారం పడి అవి పాడవుతాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని రైతుల్లోనూ అవగాహన పెంచితే ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఇకపోతే వ్యవసాయాన్ని, ఇతర గృహవినియోగాన్ని వేరు చేయాలన్న ఆలోచనా ఉంది. వీధి దీపాలకు ప్రత్యేకలైన్‌ ఏర్పాటు చేస్తామని, 250 కి.విూ. మేర కొత్తగా 11 కే.వీ విద్యుత్తు లైన్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నా మని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బందిని బృందాలుగా విభజించి గ్రామస్థాయిల్లో తీగలు వేలాడుతుండటం, అధ్వాన స్తంభాల గుర్తింపు, ఏబీ స్విచ్చులు తదితర విషయాలపై సర్వే చేయిస్తామని చెప్పారు. సర్వే ఆధారంగా గుర్తించిన సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వివరించారు. సర్వేచేసి సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేసే సమయంలో రైతులు ఒకేసారి కాకుండా రెండు విడతలుగా ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇలా చేస్తే ఈ విరామ సమయంలో మళ్లీ బోర్లలో నీళ్లు ఊరడం వల్ల ప్రయోజనం ఉంటుందని వారు తెలిపారు. ఆ మేరకు రెండు విడతలుగా సరఫరా చేస్తూ వచ్చారు. సమయానికి నీరందితేనే అన్నదాత పంట పడుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులు లేని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటి వరకు భూగర్భ జలాల ఆధారంగానే సాగు చేస్తున్నారు. గతంలో అరకొర విద్యుత్తు సరఫరా కారణంగా పంటలు ఎండి రైతులు ఆర్థికంగా చితికి పోయారు. ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు మూడేళ్లుగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో తొమ్మిదిగంటల పాటు సరఫరా చేసిన అధికారులు… 24 గంటల పాటు నిరంతరాయంగా సాగుకు విద్యుత్తును సరఫరా చేయడం మొదలుపెట్టారు. 24గంటల సరఫరాకు తగినట్లుగా భారాన్ని మోసేలా విద్యుత్తు లైన్లను కొత్తగా వేయడంతో పాటు ఉపకేంద్రాల సామర్థ్యాన్ని పెంచారు. 33/11 కేవీ ఉప కేంద్రాల్లో 104 చోట్ల శక్తివంతమైన ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చడంతో పాటు మరో 81 కేంద్రాల్లో వాటి సామర్థ్యాలను పెంచారు. దాదాపు 300 కి.విూ. మేర 33 కేవీ విద్యుత్తు లైను ఏర్పాటు చేశారు. ఇలా అన్నిరకాలుగా సిద్ధమైన యంత్రాంగం జిల్లాలోసాగుకు

నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో తలెత్తనున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. విద్యుత్తు లైన్లు, ఉపకేంద్రాల సామర్థ్యాన్ని పెంచినప్పటికీ 24 గంటల పాటు సాగుకు సరఫరా చేయడంతో విద్యుత్తు వ్యవస్థపై పడే భారాన్ని పరీక్షించ నున్నారు.