24న టీడీపీలోకి కిశోర్‌ చంద్రదేవ్‌

– టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజుతో భేటీ
– పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ
విజయనగరం, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 24న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి విజయనగరం వచ్చిన ఆయన సోమవారం టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతిరాజుతో భేటీ అయ్యారు. అశోక్‌ గజపతిరాజు ఆయనకు సాదర స్వాగతం పలికి ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురి మధ్య పలు అంశాలపై చర్చసాగినట్లు తెలుస్తోంది. అనంతరం కిశోర్‌ చంద్రదేవ్‌ విలేకరులతో మాట్లాడారు.. మోదీ పాలనతో ప్రజాస్వామ్యం పరిహాసంగా మారిందని, సామ్యవాద సిద్ధాంతాలను మరిచి మోదీ పాలిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దేశంలోని అనేక పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కావడం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీదే విజయమని పేర్కొన్నారు. ఈ నెల 24న టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు కిశోర్‌ చంద్రదేవ్‌ తెలిపారు. అమరావతిలో ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కుతానని వెల్లడించారు. అశోక్‌ గజపతిరాజుతో తనకెలాంటి విబేధాలు లేవని, తామిద్దరం అన్నదమ్ముల్లా కలిసి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.