27న కౌంటింగ్‌ కోసం ఏర్పాట్లు

సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి
వరంగల్‌,మే18(జ‌నంసాక్షి): కౌంటింగ్‌ పక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ సూచించారు. ఎంపిటిసి, జెడ్పీటిసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న కౌంటింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20లోపు బారికేడింగ్‌, జాలీల ఏర్పాట్లు, ఎంపీటీసీల పోలింగ్‌ కేంద్రాల వారీగా టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెక్‌లిస్టు ప్రకారం కౌంటింగ్‌ పక్రియను నిర్వహించాలని, చెల్లని ఓట్లపై స్పష్టత ఉండాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన నిబంధనల ప్రకారం ఓట్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీవోలతో సమావేశంలో పలు అంవాలను చర్చించారు. కౌంటింగ్‌ కేంద్రంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం రిటర్నింగ్‌ అధికారులకు మాత్రమే ఉంటుందన్నారు. కౌంటింగ్‌ పక్రియ పూర్తయ్యే వరకూ రిటర్నింగ్‌ అధికారులు ఎంపీడీవోలకు అందుబాటులో ఉంటూ కౌంటింగ్‌ ఏర్పాట్లలో నిమగ్నం కావాలని ఆయన ఆదేశించారు. కౌంటింగ్‌ నిబంధనలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్‌ మాన్యువల్‌ను అర్థం చేసుకోవాలన్నారు. ముందుగా ఎంపీటీసీ ఓట్లను కౌంటింగ్‌ చేసి ఫలితాలు ప్రకటించి ఎంపీటీసీ అభ్యర్థులను బయటకు పంపి తర్వాత జెడ్పీటీసీ ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభించాలన్నారు.  అలాగే పోటీలో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులందరికీ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోలకు కలెక్టర్‌
సూచించారు. అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలను తెరిచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ రూంలోకి తేవాలన్నారు. కౌంటింగ్‌ పక్రియనంతా వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆయన పేర్కొన్నారు.