38వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌

ముంబయి, ఆగస్టు9(జ‌నం సాక్షి) : లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్లాయి. పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను లిఖిస్తోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు మరోసారి చరిత్ర సృష్టించాయి. మార్కెట్‌ చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్‌ 38వేల మార్క్‌ను దాటింది. అటు నిఫ్టీ కూడా సరికొత్త జీవనకాల గరిష్ఠస్థాయిని చేరింది. శుక్రవారం వెలువడబోయే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ తైమ్రాసిక ఫలితాలపై మదుపర్లు ఆశాజనకంగా ఉన్నారు. దీనికి తోడు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కూడా కొనుగోళ్లు ఊపందుకోవడంతో గురువారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. ప్రీ ట్రేడింగ్‌లోనే 125 పాయింట్లకు పైగా లాభంతో 38వేల మార్క్‌ను తాకిన సెన్సెక్స్‌.. మార్కెట్‌ ఆరంభమైన తర్వాత కూడా అదే జోరు సాగించింది. మార్కెట్‌ ఆద్యంతం అదే జోరును సాగించిన సూచీ.. చివరకు 137 పాయింట్లు ఎగబాకి 38,024 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. అటు నిఫ్టీ కూడా 22 పాయింట్ల లాభంతో 11,472 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.62గా కొనసాగుతోంది. ఈఎన్‌ఎస్‌ఈలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హిందాల్కో, వేదాంతా షేర్లు లాభపడగా.. ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఓఎన్జీసీ, సిఎలా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌  లిమిటెడ్‌ షేర్లు నష్టపోయాయి.