65వ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ

 

 

 

 

 

సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలో ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ ప్రయాణికులు తమ వంతుకోసం వేచిచూడాల్సి వస్తున్నది. దీంతో ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్లిపోయేలా అధికారులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇందులో భాగంగా విజయవాడ మార్గంలోనే 10 టోల్‌ ప్లాజాలను తెరిచారు. గతంలో మూడు సెకండ్లు ఉన్న ఫాస్టాగ్‌ సెన్సర్‌ను ప్రస్తుతం రెండు సెకండ్లకు కుదించారు. దీంతో రెండు సెకన్ల వ్యవధిలోనే వాహనాలు టోల్‌ప్లాజా నుంచి బయటకు వెళ్తున్నాయి. ఇలా నిమిషానికి 20 వాహనాలు టోల్‌ ప్లాజా నుంచి బయటపడుతున్నాయి.