తెలంగాణాకూ ప్రత్యేక హోదా ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014కు ఆమోద ముద్ర వేసిన పార్లమెంట్‌ ఉభయ సభలు విభజన తర్వాత ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఓటేశాయి. ఈ చర్చ పెద్దల సభలో సాగినా లోక్‌సభలో చర్చకు అనుకూల వాతావరణం లేదు కాబట్టి ఉభయ సభలు ప్రత్యేక హోదాను సమర్థించినట్టుగానే భావించాలి. సీమాంధ్ర ఎంపీల అనవసర ఆందోళన వారితో జతగూడిన శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌, జాలర్ల సమస్య పేరుతో ఏఐఏడీఎంకే పార్లమెంట్‌ ఉభయ సభల్లో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చ సవ్యంగా సాగకుండా చేశాయి. లోక్‌సభలో సాగిన చర్చలో హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే, ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి మాత్రమే చర్చలో పాల్గొనగా, రాజ్యసభలో సీమాంధ్ర ఎంపీలతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళనల మధ్యే చర్చ కొనసాగింది. పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న అన్ని పార్టీలు తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొన్నాయి. మెజార్టీ రాజకీయ పక్షాలు తెలంగాణకు జై కొట్టగా స్థానిక పరిస్థితులు, భవిష్యత్‌ సంకీర్ణపుటెత్తులు ఇతరత్రా కారణాలతో కొన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటు వ్యతిరేకించాయి. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన కొన్ని పార్టీలు అందుకు ప్రాతిపదిక ఏమిటో కూడా చెప్పలేదు. ఆయా పార్టీలు అధికారంలో ఉన్న, ప్రాతినిథ్యం వహిస్తోన్న రాష్ట్రాల్లో విభజన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి వాటికి ఊతమిచ్చే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని, అది సాధ్యం కాని పరిస్థితుల్లో కనీసం వ్యతిరేకించాలనేది ఆ పార్టీల వ్యూహంగా కనిపించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు ఉన్న చారిత్రక నేపథ్యం, ప్రజల ఆకాంక్షలను ఆయా పార్టీలు విస్మరించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డితో 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత స్నేహ హస్తం కోసమే అర్రులు చాచాయి. కేవలం ఎన్నికల్లో లబ్ధికోసమే పాకులాడే పార్టీలు తెలంగాణ ప్రజలకే కాదు అవి ప్రాతినిథ్యం వహిస్తోన్న, అధికారం వెలగబెడుతోన్న రాష్ట్రాలకు అక్కడి ప్రజలకు కూడా న్యాయం చేయలేవు. ఆయా పార్టీల ఏకైక లక్ష్యం రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడమే అవుతుంది తప్ప ప్రజాసంక్షేమం ఎప్పటికీ కాబోదు. ఇకపోతే తెలంగాణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడానికి సహకరించిన బీజేపీ బిల్లు సభల ముందుకు రాకముందు, వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు బహు విచిత్రం. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల్లో క్రమశిక్షణ పేరుతో అధికారపక్షంపై నెపం మోపడం ద్వారా బీజేపీ తెలంగాణపై నిర్దిష్టమైన విధానాన్ని అనసరించలేకపోయింది. మధ్యలో సీమాంధ్ర పార్టీలతో పొత్తుల వ్యవహారం ఆ పార్టీ చలపచిత్తానికి నిదర్శనంలా నిలిచింది. తెలంగాణ ఏర్పాటు చేయాలంటూనే సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని ఆ పార్టీ పట్టుబట్టింది. తెలంగాణ ఏర్పాటు చేస్తూనే సీమాంధ్రకు న్యాయం చేస్తేనే తాము మద్దతిస్తామని భీష్మించుకు కూర్చుంది. ఫలితంగా సీమాంధ్ర పెట్టుబడిదారుల గొంతెమ్మ కోర్కెలకు కేంద్రం తలూపాల్సి వచ్చింది. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సీమాంధ్ర ఏలాపోయినా పరవాలేదని ఒక్క తెలంగాణ బిడ్డ అనుకోలేదు. సీమాంధ్ర ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన వన్నీ ఏర్పాటు చేయాల్సిందేనని తెలంగాణ ప్రజలూ కోరుకున్నారు. బీజేపీ నాయకులు, ముఖ్యంగా వెంకయ్యనాయుడు పట్టుబట్టడంతో కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంతానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఈ ప్రత్యేక ప్యాకేజీ వర్తింస్తుందని కేంద్రం పేర్కొంది. ప్రత్యేక ప్యాకేజీ వర్తించే ఈ జిల్లాలకు దేశంలోని 11 రాష్ట్రాలతో బాటుగా ప్రత్యేక సదుపాయాలు, రాయితీలు అందనున్నాయి. కేంద్ర బడ్జెట్‌లోని 30 శాతం నిధులు ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు కేంద్రం పంచుతుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రం లేదా ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా కేటాయించకుండానే కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు మంజూరవుతాయి. 90 శాతం నిధులను కేంద్రం గ్రాంటుగా, పది శాతం నిధులను అప్పుగా కేటాయిస్తుంది. మిగతా ప్రాంతాలకు 30 శాతం నిధులను గ్రాంటుగా, 70 శాతం నిధులను అప్పుగా కేంద్రం కేటాయి స్తుంది. అంటే ప్రత్యేక హోదా ఉన్న ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం కేటాయించే నిధుల్లో పది శాతం మాత్రమే తిరిగి చెల్లించాలి. అంతేకాదు ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించే పారిశ్రామిక వేత్తలకు పన్ను రాయితీలతో పాటు భూమి కేటాయింపు, వనరుల కేటాయింపుల్లోనూ సబ్సిడీలు ఇస్తారు. ఫలితంగా పారిశ్రామిక వేత్తలు ఆయా ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తారు. సీమాంధ్రలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు వెనుకబడిన మాట వాస్తవం కానీ అదే సమయంలో తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందిన ప్రాంతమా? హైదరాబాద్‌ అభివృద్ధిని మొత్తం పది జిల్లాల అభివృద్ధిగా పరిగణించాలా? సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించిన కేంద్రానికి, అందుకోసం మద్దతుపై షరతులు పెట్టిన బీజేపీకి తెలంగాణలోకి వెనుకబడిన ప్రాంతాలకు కనిపించలేదా? వర్షాకాలం వస్తే కనీస వైద్య సేవలు అందక పిట్టల్లా రాలిపోయే ఉట్నూర్‌, భద్రాచలం ఏజెన్సీలోని ఆదివాసీల దుర్భర బతుకులు వారికి గుర్తుకు రాలేదు. ఫ్లోరైడ్‌ భూతానికి జీవితాలను కోల్పోయిన, పసితనంలోనే వార్ధక్యం ముసురుకున్న నల్లగొండ జిల్లా బిడ్డలు వారికి కానరాలేదా? ఎక్కడ పని దొరికితే పెట్టేబేడా సర్దుకొని, పిల్లాపాపలను చంకనెత్తుకొని బతుకుజీవుడా అంటూ వలసబోయే మహబూబ్‌నగర్‌ మట్టి మనుషులు వారికి కనిపించలేదా? ఏడు దశాబ్దాలకు సమీపిస్తోన్న స్వతంత్ర భారతంలో కనీసం వైద్యం అందుబాటులో లేని ఆదివాసీల పరిస్థితి ఏమిటి? చేయని పాపానికి కాళ్లు, చేతులు వంకరపోయి, సొట్టుబోయి, ఉబ్బిపోయిన తలలతో చావుకు ఎదురు చూసే నల్లగొండ బిడ్డల దైన్యానికి కారకులెవరూ? కూడు, గుడ్డ, నీడ కల్పించలేని పాలకుల చేతగాని తనానికి పని వెదుక్కుంటూ దేశవిదేశాలకు వెళ్లే మహబూబ్‌నగర్‌ కూలీలలకు దిక్కెవరూ. ఈ ప్రాంతాలు ప్రత్యేక హోదా అర్హమైనవి కావా. తెలంగాణ ఇస్తున్నారు కదా కని వెనుకబడిన ప్రాంతాలను అలాగే వదిలేస్తారా? ఇన్నాళ్లు దోపిడీకి, అణచివేతకు పాల్పడిన వారి పక్షమే వహిస్తారా? బీజేపీ విధానంలో ఉన్నట్టుండి మార్పు రావడానికి కారకుడు వెంకయ్య నాయుడు, బిల్లు ఎలాగైనా గట్టెక్కించాలనే యోచనలో కాంగ్రెస్‌ ఆయన కోరిన అన్నింటికి సరేనంటూ తలూపింది. తెలంగాణ ఇస్తున్నామంటూ హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీ, భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లలోని ఆదివాసీ గూడాలను ముంచేందుకు అంగీకరించిన పాలకులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మాత్రం విస్మరించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్న ప్రధాన మాట తప్ప తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఆయా ప్రాంతాల ప్రజల హక్కులను కాలరాయడమే. కేంద్రం ఇప్పటికైనా దీనిపై స్పందించాలి. ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారానైనా తెలంగాణాకూ ప్రత్యేక హోదా కల్పించాలి.