తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం

ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి నాంది పలికారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా సంస్థల్లో తీవ్ర నిర్బంధంలోనూ పనిచేస్తూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమైన కలం వీరులు స్వీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు జర్నలిస్టుల జాతర వేదికగా సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఆకాంక్షను పల్లెపల్లెకు చేర్చిన జర్నలిస్టులు నవ తెలంగాణ నిర్మాణంతో పాటు తమ హక్కుల సాధన కోసం కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. జర్నలిస్టుల పక్షాన, వారి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమించిన జర్నలిస్టుల నేతృత్వంలో టీయూడబ్య్లూజే పురుడు పోసుకుంది. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకునేందుకు పది జిల్లాల జర్నలిస్టులు తెలంగాణ జర్నలిస్టు ఫోరం పేరుతో ఐక్య ఉద్యమాలు సాగించారు. వివిధ జర్నలిస్టు యూనియన్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే టీజేఎఫ్‌లో వారంతా పాలు పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో సాగుతున్న తరుణంలో ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలన్నీ తెలంగాణలో ప్రత్యేక యూనియన్లు ఏర్పాటు చేసుకొని అస్తిత్వ పోరాటాలు సాగించగా తెలంగాణ జర్నలిస్టులు టీజేఎఫ్‌ బ్యానర్‌పైనే ఉద్యమాలు సాగించారు. తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ భావజాల వ్యాప్తికి జర్నలిస్టులు ఎత్తిన కలం దించకుండా మొక్కవోని దీక్ష ఉద్యమాన్ని సాగించారు. ఒకానొక దశలో తెలంగాణ ఆకాంక్షను చాటిన జర్నలిస్టులను సీమాంధ్ర యాజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు సిద్ధపడినప్పుడు, ఉద్యోగాల నుంచి తీసేసినప్పుడు వర్కింగ్‌ జర్నలిస్టులకు పెద్ద దిక్కుగా ఉన్న యూనియన్‌ సహా మిగతా సంఘాలేవి గొంతెత్తలేదు. టీజేఎఫ్‌ ట్రేడ్‌ యూనియన్‌గా లేదు కాబటి నిరసన వ్యక్తం చేయడం మినహా ఉద్యమం చేయలేని పరిస్థితి. అయినా తెలంగాణ జర్నలిస్టుల పక్షాన యాజమాన్యాలపై పోరుకు సిద్ధమైంది. సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన టీజేఎఫ్‌ వారితో కలిసి ఐక్య ఉద్యమాలు సాగించింది. 42 రోజుల సకల జనుల సమ్మెలో సింగరేణిలో తట్టాచెమ్మాస్‌ కదల లేదంటే అందులో టీజేఎఫ్‌ పాత్ర కూడా ఉంది. ఇంతకాలం రాష్ట్ర జర్నలిస్టు యూనియన్లలో ఏకచత్రాధిపత్యం వహిస్తున్న ఆధిపత్య సంఘానికి ప్రత్యామ్నాయశక్తిగా టీయూడబ్ల్యూజే దూసుకు వస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆదివారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఆవిష్కరణ సభ దీనిని చాటిచెప్పింది. సభ వేదికపై టీజేఎఫ్‌ కన్వీనర్‌గా 13 ఏళ్లుగా ఉద్యమాన్ని నడిపిస్తున్న అల్లం నారాయణ ఏపీయూడబ్ల్యూజేకు విడాకులిచ్చి టీయూడబ్ల్యూజే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘకాలం ఏపీయూడబ్ల్యూజేలో పనిచేసిన ఎందరో జర్నలిస్టులు స్వీయ అస్తిత్వ పోరాటంలో భాగస్వాములు అయ్యేందుకు టీయూడబ్ల్యూజేలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీయూడబ్ల్యూజే కేవలం జర్నలిస్టుల హక్కుల కోసమే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణంలోనూ క్రియాశీలంగా వ్యవహరించబోతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని, తెలంగాణ భావజాల వ్యాప్తిని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఇంతకాలం ప్రజలకు చాటిచెప్పిన టీజేఎఫ్‌, టీయూడబ్ల్యూజేగా రూపాంతరం చెందాక అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేందుకు, ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందేందుకు పాటు పడుతుందని పేర్కొంది. తెలంగాణ గెజిట్‌లో ఉన్న లోపాలే లక్ష్యంగా మరిన్ని ఉద్యమాలకు నేతృత్వం వహిస్తుందని, తెలంగాణ వనరులు, తెలంగాణ ఉద్యోగాలు పూర్తిగా తెలంగాణ వారికే దక్కేందుకు పాటు పడుతుందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు తలెత్తుకు తిరిగేలా ఉండేందుకు, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాల కోసం మీడియా సంస్థల యాజమాన్యాలతో జర్నలిస్టుల పక్షాన పోరాడేందుకు సిద్ధమని చెప్పింది. రాష్ట్రంలో ఆధిపత్య ట్రేడ్‌ యూనియన్‌గా ఉన్న ఏపీయూడబ్ల్యూజే తెలంగాణ ప్రజల పక్షాన పోరాడలేదనేది వాస్తవం. తెలంగాణ శాఖ ఏర్పాటుకు కూడా ఆ సంఘం పునర్విభజనకు ముందు అంగీకరించలేదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత వేర్వేరు శాఖలను ఏర్పాటు చేసినా టీయూడబ్ల్యూజే మన రాష్ట్రం-మన యూనియన్‌ అనే నినాదంతో పది జిల్లాల జర్నలిస్టులకు చేరువైనట్లుగా స్పష్టమైంది. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఆవిర్భావ సభకు సంపాదకులు మొదలు గ్రామీణ విలేకరుల వరకూ హాజరయ్యారు. జర్నలిస్టుల, ప్రజల ఆకాంక్షల వైపు టీయూడబ్ల్యూజే అడుగులు వేస్తే ఈ సంఘానికి పది జిల్లాల్లో ఆదరణ ఖాయం. జర్నలిస్టు యూనియన్లలో మహిళల భాగస్వామ్యం తగ్గడానికి ప్రధాన కారణం ఆయా యూనియన్లలో ఉన్న విందు రాజకీయాలు. టీయూడబ్ల్యూజే ఆవిర్భావంలోనే అలాంటి సంస్కృతిని దూరం పెట్టింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన నడిచేందుకు ఒక శక్తి అవసరమున్నది. టీయూడబ్ల్యూజే కనుక జర్నలిస్టులు, ప్రజల ఆకాంక్షలే పరమావధిగా ముందుకు సాగితే ఆ శక్తిగా నిలిచి తీరుతుంది. లేనిపక్షంలో అనేక యూనియన్ల మాదిరిగానే ఇది ఒక సంఘంగా మిగిలిపోతుంది. ట్రేడ్‌ యూనియర్‌గా కాకుండా ఫోరంగా ఉన్నప్పుడే ప్రజాపక్షం వహించిన సంఘం పూర్తిస్థాయి యూనియన్‌గా ఆవిర్భవించిన తర్వాత మరింత క్రీయాశీలకంగా వ్యవహరిస్తుందనే నమ్మకం జర్నలిస్టుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత యూనియన్‌ నాయకులపైనే ఉంది. నిజంగా తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఆవిర్భావం నవ శకానికి నాంది పలకడమే. కొత్త ఆశలతో మొగ్గ తొడిగిన టీయూడబ్ల్యూజే మహావృక్షమై తెలంగాణ జర్నలిస్టులకు నీడగా నిలవాలి. పీడితులకు అండగా ఉండాలి. వారి గొంతుకై ప్రశ్నించాలి.