భద్రాద్రికి భక్తుల రాక షురూ..

ఖమ్మం, ఏప్రిల్‌ 5 : తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి … చూస్తే సీతారాముల కల్యాణమే చూడాలి.. భక్తులలో ఇదో నానుడి. అందుకే అనుకుంటాం ప్రతిఏటా భద్రాద్రిలో జరిగే రామయ్య కల్యాణానికి భక్తులు వెల్లువలా వస్తుంటారు. ఈ ఏడాది కల్యాణానికి అప్పుడే భక్తుల రాక ప్రారంభమైంది.  తమ ఇష్టధైవం రామయ్య  కల్యాణాన్ని కనులారా చూడాలన్న తపనతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాలినడకన భద్రాద్రికి చేరుకునే భక్తుల సంఖ్య రెండు రోజులుగా పెరుగుతూ వస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తులు నర్సారావుపేట, కుకునూరు మీదుగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. వందల మైళ్ల దూరం ఎలా నడవగలుగుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే రామయ్య తండ్రే తమను నడిపిస్తున్నారని  వారినుంచి సమాధానం వస్తోంది. ఆమె వయస్సు 6 పదులపైనే ఉంటుంది. అలుపెరగకుండా నాలుగు సంవత్సరాల నుంచి భద్రాద్రికి కాలినడకన వస్తోంది. ఎర్రటి ఎండలో ఎలా నడవగలుగుతున్నారని అడిగితే ఆ రాముడే తమను నడిపిస్తున్నారని ఆమె బదులిచ్చా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆత్మకూరి దేవి తెలిపారు. ఆ ఊరు నుంచి ప్రతిఏటా భక్తులు కాలినడకన భద్రాచలం వచ్చి సీతారాముల కల్యాణం చూస్తారు. ఈ ఏడాది నేను చూడాలనే తపనతో బయలుదేరానని అన్నారు. దాదాపు ఇప్పటికే 120 కిలోమీటర్లు నడిచానని, మరో 45 కిలోమీటర్లు పయనిస్తే తన లక్ష్యం నెరవేరుతుందని నిడదవోలుకు చెందిన మరోభక్తుడు సుబ్బారావు అనే భక్తుడు తెలిపారు.