అత్యాచారాలను ఖండిస్తా.. కఠినంగా శిక్షించాల్సిందే..

 అత్యాచారాలపై చర్చ జరగాల్సిందే…

సంభల్(యుపి)): ‘‘కుర్రాళ్లు తప్పులు చేస్తారు. అంతమాత్రాన మరణశిక్ష విధిస్తారా?’’ అంటూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశవ్యాప్తంగా నిరసనల హోరును ఎదుర్కొంటున్న సమాజ్ వాది పార్టీ(ఎస్ పి) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే నష్టనివారణ యత్నం చేశారు.రేపిస్టులకు కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని తాను భావిస్తానని ఆయన చెప్పారు. ‘‘తప్పుడు కేసుల్లో ఇరుకున్న వారు శిక్షలు పొందడానికి మేము అంగీకరించం. లోపభూయిష్ట చట్టాలను మార్చాల్సిందే’’ అని ఆయన చెప్పారు.గురువారం ఒక ఎన్నికల ప్రచార సభలో ములాయం ప్రసంగిస్తూ, ‘‘అత్యాచార కేసులలో  ఉరిశిక్ష విధిస్తారా? కుర్రాళ్లు కుర్రాళ్లే, వాళ్లు తప్పులు చేస్తారు. అటువంటి చట్టాలను మార్చడానికి మేము ప్రయత్నిస్తాం. తప్పుడు కేసుల్లో శిక్ష పడకుండా చూస్తాం’’ అని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం  తెలియచేస్తూ జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.‘‘ఇది చర్చించాల్సిన అంశం. చర్చల ద్వారా సత్ఫలితాలు వస్తాయి. నా వ్యాఖ్యలు సరైనవని చాలా మంది చెప్పారు. నేను అత్యాచారాలను ఖండిస్తాను. అత్యాచారానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలని నేను కోరతాను. అయితే అమాయకులను ఉరితీయరాదు. ప్రపంచవ్యాప్తంగా అత్యాచారంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. నేను అదే చెబితే అందులో తప్పేముంది?’’ అని ములాయం ప్రశ్నించారు.ముంబైలోని శక్తి మిల్స్‌లో గత ఏడాది ఒక మహిళా ఫోటో జర్నలిస్టు, ఒక టెలిఫోన్ ఆపరేటర్ లపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులలో ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ములాయం గురువారం వ్యాఖ్యానించారు.