మాకే కాదు మీకు మాటఇచ్చి త‌ప్పాడు : రాహుల్‌

వెన్నంటే ఉంటానని వెన్నుపోటు పొడిచారు..

కెసిఆర్ పేరు ప్రస్తావించుకుండా చురకలు

డిచ్‌పల్లి, నిజామాబాద్ జిల్లా: “కొద్ది రోజుల క్రితం కొందరు టిఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో నా ఇంటికి, నా కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వారిలో ఒక వ్యక్తి నాతో చేతులు కలిపారు. నాతో ఐదారు నిముషాలు మాట్లాడారు. నేను తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మీతోనే ఉంటామన్నారు. టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామన్నారు. బయటకు వచ్చాక వెళుతూ వెళుతూ మళ్ళీ వెనక్కి వచ్చారు. మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలని ఉందన్నారు. ఆలింగనం చేసుకున్నారు. అలా చేసి బయటకు వెళ్ళిన తర్వాత వెన్నుపోటు పొడిచారు. దళితున్ని సిఎం చేస్తానని హామీ ఇచ్చిన సదరు వ్యక్తి కాంగ్రెస్‌తో పాటుగా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలతో అసత్యాలు ఆడారు.”సోమవారం సాంపల్లిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇటువంటి వేర్పాటువాదులను, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేవారిని వచ్చే ఎన్నికల్లో ఓడిద్దామని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ప్రసంగం ఆద్యంతం అత్యంత నాటకీయంగా సాగింది. కేసీఆర్ గురించి చెప్పడానికి ముందు “కొద్ది సేపు ఓపిక పట్టిండి.. ఆ వ్యక్తి పేరు నేను మీకు చెప్పాల్సిన పనిలేదు” అని సభికుల అనూహ్య స్పందన మధ్య తన ప్రసంగం పట్ల ప్రజల్లో ఒకింత ఆసక్తిని కలిగించడానికి రాహుల్ ప్రయత్నించారు. చాలావరకు సఫలీకృతులయ్యారు.