పార్టీలను విలీనం చేస్తే కొత్త రాష్ట్రాలా?


ఇదేం సిద్ధాంతం
రాహుల్‌ను నిలదీసిన కేసీఆర్‌
వరంగల్‌, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి) :రాజకీయ పార్టీలను విలీనం చేసుకోవడం కోసమే భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేస్తారా అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు. ఎన్నికల్లో మాట్లాడడానికి సమస్యలే లేవా? కేవలం కేసీఆర్‌ను తిట్టడమే పనా? అని మండిపడ్డారు. తెలంగాణ తన అస్తిత్వాన్ని కోరుకుంటోందని, ఢిల్లీకి గులాంగిరీ చేసేందుకు సిద్ధంగా లేమన్నారు. గత 60 ఏళ్లుగా అణచివేతకు గురైన తెలంగాణ అస్తి త్వాన్ని కోల్పోవడానికి సిద్దంగా లేదన్నారు. వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలో జరిగిన ఆపార్టీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ నేను మోసం చేసినట్లు రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఏం మోసామని నిలదీసారు. రాజకీయ పార్టీలను విలీనం చేసుకునేందుకే
కొత్త రాష్ట్రాలు ఇస్తారా? దేశంలో సమస్యలే లేవా అని అన్నారు. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అందరూ కేసీఆర్‌ను విమర్శించుడే. టీఆర్‌ఎస్‌ను విమర్శించడమే పనా? అని అన్నారు. తన సుడిగాలి పర్యటనను చూసి కాంగ్రెస్‌ వాళ్లకు కన్ను కుడుతున్నది. వాతావరణం సరిగ్గా లేదని నా హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి అనుమతి రానివ్వడం లేదు. బిల్లు రూపకల్పనలో మా పాత్రలేదని సోనియాగాంధీ అన్నారు. మా పాత్ర లేనప్పుడు పార్టీ విలీనం గురించి ఎందుకు అడిగారు? తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. రాహుల్‌గాంధీ సోమవారం తనపై చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు. రాహుల్‌ కంపెనీకి ప్రజా సమస్యలు పట్టవని ఆయన అన్నారు. తాము ఢిల్లీకి తాబేదార్లం కాదని జవాబు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తమ పాత్ర లేదని సోనియా చెప్పినప్పుడు పార్టీ విలీనం గురించి ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసుకు ప్రజా సమస్యలు పట్టవా, తెరాసను విమర్శించడమే పనా అని ఆయన అడిగారు. 2004లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని పాతాళంలోకి తొక్కి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించామని ఆయన గుర్తు చేశారు. మాకే మీరు ఈ విధంగా రుణపడి ఉన్నారన్నారు. మేమేమీ విూకు బాకీ లేమన్నారు. కాంగ్రెసు నాయకుల అన్యాయాలను బయటపెడితే వారు తన ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల కబ్జా చేసిన జాగలను స్వాధీనం చేసుకుంటామని అడిగితే తన ఆస్తుల గురించి విచారణ అంటున్నారని ఎద్దేవా చేశారు. కమాన్‌ తన ఆస్తులను విచారణ చేయించుకోవచ్చన్నారు. మరి కబ్జా భూముల సంగతేంటని ప్రశ్నించారు. కాంగ్రెసు వాళ్ల వద్ద ఉన్నట్లు తన వద్ద అక్రమాస్తులు లేవని ఆయన అన్నారు. ఉంటే ఇంతకాలం ఊకుందురా అని అన్నారు. ఉప ఎన్నికల్లో తమను ఓడించడానికి కాంగ్రెసువాళ్లు 186 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు. భూపాలపల్లిలో కొత్త గనులు వస్తాయని, అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఆయన అన్నారు. తెరాస శాసనసభ అభ్యర్థులనే కాకుండా లోకసభ అభ్యర్థులను కూగా గెలిపించాలని ఆయన కోరారు. వరంగల్‌ జిల్లా తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా చేసి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెడతామన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా కొనసాగిస్తామని కేసీఆర్‌ అన్నారు. మానవతా దక్పదంతోటి పేదల ఆత్మగౌరవం నిలబడేలా పింఛన్లను అందిస్తామన్నారు. రైతులకు రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామన్నారు. వద్ధులకు, వితంతువులకు, అంగవికలురకు నెలకు రూ. 1500 పింఛను అందించనున్నట్లు ఆయన తెలిపారు. తెరాసతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆపార్టీ అధినేత కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. విద్యుదుత్పత్తికే తమ మొదటి ప్రాధాన్యమని వివరించారు. భూపాలపల్లిలో మెగా వపర్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస గెలుపు చారిత్రక అవసరమని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ఆంధ్రోళ్లతో ఇంకా పంచాయతీ అయిపోలేదు. ఇంకా మనకు ప్రాజెక్టులు, నిధులు రావాల్సి ఉన్నదని కేసీఆర్‌ అన్నారు. పార్టీ అభ్యర్థులు మధుసూదనచారి, కడియం శ్రీహరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కడియం శ్రీహరి నీతి, నిజాయతీ గల వ్యక్తి అని కొనియాడారు. దేశంలోని సర్వేలన్నీ తెలంగాణదే టీఆర్‌ఎస్‌దే హవా అని తేల్చిచెబుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే 80 సీట్లు దాటుతాయని అంటున్నారని, 90 సీట్లు కూడా దాటుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, మధుసూధనాచారి, మాజీ డీజీపీ పేర్వారం రాములు తదితరులు పాల్గొన్నారు. ఇన్నేళ్లుగా తెలంగాణ కోసం పోరాడి ఇప్పుడు అస్తిత్వం కోల్పేయే విధంగా అధికారం కాంగ్రెస్‌ లేదా మరొకరి చేతిలో పెట్టొద్దని కెసిఆర్‌ ప్రజలను హెచ్చరించారు. మన తెలంగాణను మనమే అభివృద్ది చేసుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టి గోదారి ఈదినట్లేనన్నారు. టిడిపి ఎప్పటికీ ఆంధ్రా పార్టీయేనన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పుట్టిన గడ్డ ఇదని తొర్రూర్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ జిల్లాలోని తొర్రూర్‌లో జరిగిన ఆపార్టీ బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతమని కేసీఆర్‌ తెలిపారు. యుద్ధం లాంటి పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నం. 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ కల సాకరమైంది. 1969 ఉద్యమంలో 400 మంది చనిపోతే ఈ ఉద్యమంలో 1500 మంది చనిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. వరంగల్‌ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. నీళ్లు ఉన్న దగ్గర కాలువలు లేవు, కాలువలు ఉన్న దగ్గర నీళ్లు లేవని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. జిల్లాలో కంతెనపల్లి, దేవాదుల ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జూరాల నుంచి పాకాల వరకు లిఫ్ట్‌ లేకుండానే వరంగల్‌ జిల్లాకు నీళ్లు తెస్తం. ఎర్రబెల్లి, దుగ్యాల పచ్చి తెలంగాణ ద్రోహులు. కాబట్టి పాలకుర్తి ఎమ్మెల్యేగా డా. సుధాకర్‌రావును, వరంగల్‌ ఎంపీగా కడియం శ్రీహరిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. టీడీపీ ఆంధ్రా పార్టీ. తెలంగాణలో ఆంధ్రా పార్టీ ఉండేందుకు అస్కారమేలేదని కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో జరిగిన ఆపార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో మన జెండానే ఉండాలన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే మనకు సబ్బు పెడ్తడు తప్ప న్యాయం జరగదు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుండా ఆంధ్రా నేతలు కుట్రలు చేస్తున్నరన్నారు. సొంత రాష్ట్రంలో మన తలరాతను మనమే రాసుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. 14 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ కల సాకారమైంది. తెలంగాణ కోసం ఎవరేం చేశారో మానుకోట రాళ్లకు, మట్టికి కూడా తెలుసన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉందని కేసీఆర్‌ తెలిపారు. 1948-56 మధ్య జరిగిన తప్పులకు 60 ఏళ్లు గోసపడ్డం. అనేక బాధలు పడితేతప్ప ఆంధప్రదేశ్‌ నుంచి బయటపడలేకపోయినం. ఆంధ్రోళ్లతో ఇంకా పంచాయితీ అయిపోలేదు. తెలంగాణ వాటా కోసం తెగించి కొట్లాడేవాళ్లు కావాల్నా? ఆంధ్రా వాళ్ల డబ్బా కొట్టేవాళ్లు కావాల్నా? ఈసారి తప్పు జరిగితే రెండు మూడు తరాలపాటు ఇబ్బందులు పడ్తం. కాబట్టి ఈసారి జరిగే ఎన్నికల ద్వారా మన తలరాతను మనమే రాసుకుందామని ఆయన పేర్కొన్నారు.