ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపజేయాలి

తెలంగాణ శాసనసభ కొలువుదీరింది. ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరింది. ఈ రోజు కోసమే నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నది. ఈ రోజు కోసం పది జిల్లాలు ఒకే లక్ష్యంగా పోరాడింది. ప్రజల ఆకాంక్షల ముందు కుట్రలు, కుతంత్రాలు తుత్తినియలయ్యాయి. లాబీయింగ్‌లు, అసత్యపు ప్రచారాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. 1500 మంది అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. వారం రోజుల క్రితం పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొట్టతొలి సమావేశాలు నిజాం చివరి నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ నిర్మించిన భవనంలో మొదలయ్యాయి. ఇంతకాలం ఉమ్మడి రాష్ట్రానికి అసెంబ్లీగా ఉన్న భవనంలో మన శాసనసభ కొలువు దీరాలని ప్రతి తెలంగాణ పౌరుడూ ఆశించాడు. ఆ ఆశ ఎట్టకేలకు నెరవేరింది. తొలి తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి వ్యవహరించారు. ఆయనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సహా మిగతా సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం వాయిదాపడిన శాసనసభ మంగళవారం మళ్లీ ప్రారంభం కానుంది. తొట్టతొలి శాసనసభ సమావేశాల్లో స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం, డెప్యూటీ స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగానికి దన్యవాదాలు తెలపడంతో ముగుస్తుంది. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్‌ సమావేశాల నుంచి తెలంగాణ శాసనసభ పూర్తిస్థాయిలో తన పని ప్రారంభించనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆమోదం పొందిన ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ పద్దులతోనే ప్రస్తుతం తెలంగాణ పద్దులతోనే చెల్లింపులు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం జూన్‌ రెండో తేదీన ఉనికిలోకి రాగా మే నెల చివరివారంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రెజరీ శాఖ అన్ని రకాల చెల్లింపులను పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం జూన్‌ నెలకు సంబంధించిన వేతనాలతో పాటు ఇతర పద్దులకు సంబంధించిన చెల్లింపులు జూలైలో చేయాల్సి ఉంది. ఉన్నతాధికారులు, ఉద్యోగుల బదలాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. ఈలోగా పంపిణీకి సంబంధించిన విషయాలన్ని పూర్తయితే కొత్త ప్రభుత్వం పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశముంది. తెలంగాణ తొలి శాసనసభకు ఎన్నికైన 119 మంది సభ్యులు పూర్తిగా తెలంగాణ పౌరులే. సీమాంధ్ర సభలో తెలంగాణ గడ్డకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉమ్మడి రాష్ట్రంలో సర్వస్వం కోల్పోయిన తెలంగాణ గడ్డకు జవసత్వాలు తేవాల్సిన బాధ్యత శాసనసభపైనే ఉంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు సమ్మిళితంగా ఉండే శాసనసభ తెలంగాణ పునర్మిర్మాణంలో తన బాధ్యతను గుర్తెరగాలి. ప్రజలు ఎన్ని ఆశలతో సభ్యులను చట్టసభకు పంపారో ఆ బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నించాలి. కొత్త రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయని ఆశిస్తున్న ప్రజలందరి పక్షాన సభ్యులు గొంతు విప్పాలి. పనికిమాలిన ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాలం వృథా చేయకుండా నూటికి నూరుపాళ్లు ప్రజా సమస్యలకే ప్రాధాన్యమివ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గడ్డ ఎన్ని రంగాల్లో వివక్షకు గురైందో బడికి వెళ్లే పిల్లాడినడిగినా చెప్తాడు. ఇక శాసనసభ్యులుగా సభలో అడుగుపెట్టిన వాళ్లు, పెద్దల సభ మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న వాళ్లకు ఈ విషయాలు తెలియనివి కావు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంపై అప్పుడే సీమాంధ్ర పెత్తందారుల దాడి మొదలయ్యింది. తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే చాలా తొందరపాటు తనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఫక్తు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం కనుక ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే శాసనసభ వేదికగా నిలదీసే అవకాశాన్ని ప్రజలు సభ్యులకు కట్టబెట్టారు. పూర్తి మెజార్టీ ఉంది కాదా అని అధికారపార్టీ ఒంటెత్తు పోకడలతో నియంతృ పోకడలు పోతే కచ్చితంగా దానిని వ్యతిరేకించాల్సిందే. కానీ ఇంకా విధివిధానాలే ఖరారు కానీ రుణమాఫీపై ఆరోపణలు, ఆందోళనలు మన స్థాయిని దిగజారుస్థాయి. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏదో ద్రోహం చేయబోతోంది అనే ప్రచారం ఇప్పటికే కొందరు రైతుల ప్రాణాలను బలిగొంది. ఇలాంటి ప్రచారమే తెలంగాణ ఉద్యమ సమయంలోనూ చేసి, ఎప్పటికీ తెలంగాణ ఏర్పడబోదంటూ సొంత తీర్పులు ఇచ్చి సీమాంధ్ర పెత్తందారులు, మీడియా వేయి మందికిపైగా యువత ఆత్మబలిదానాలకు కారణమైంది. సీమాంధ్ర పెట్టుబడిదారిశక్తులు, పార్టీల లక్ష్యం ఒక్కటే తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిర పర్చడం అందుకోసం తమ పార్టీకి చెందిన తెలంగాణ నేతలను సర్కారుపై ఎగదోస్తున్నది. ముఖ్యంగా రైతు రుణమాఫీపై సీమాంధ్ర రైతులకు ఏం చేయబోతున్నదో కూడా సరిగా చెప్పని టీడీపీ ప్రభుత్వం కేవలం విధివిధానాల ఖరారు కోసం కమిటీని వేసింది. కమిటీ నివేదిక ఇచ్చేందుకు 45 వరకు గడువు కూడా విధించింది. ఆలోగా ఖరీఫ్‌లో విత్తనాల సీజన్‌ దాటిపోతుంది. అప్పటి వరకు సీమాంధ్ర రైతులకు బ్యాంకు రుణాలిచ్చే పరిస్థితే లేదు. దాన్ని తెలంగాణ టీడీపీ నేతలు అక్కడ లోటుబడ్జెట్‌ పేరుతో కప్పిపుచ్చుతూ ఇక్కడ హామీకి కట్టుబడి ఉన్నామని చెప్తున్నా తెలంగాణ సర్కారుపై యుద్ధం చేయడాన్ని మాత్రం మానడం లేదు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. నిజంగా ప్రభుత్వం పనిచేయకపోతే కచ్చితంగా నిలదీయాల్సిందే. ప్రభుత్వంతో పనిచేయించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాలదే. నిర్మాణాత్మక పోషించాల్సిన ప్రతిపక్షాలు ఆ బాధ్యతను విస్మరించి ప్రయోజనాల కోసం పనిచేయడం సరికాదు. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రజలకెన్నో వాగ్దానాలిచ్చింది. వాటి అమలు కోసం పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడేదాకనైనా వేచిచూడాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో రాజకీయాలకు చోటు లేకుండా శాసనసభ వేదికగానే ప్రతి ఒక్క సభ్యుడు పనిచేయాలి. ప్రజలు వారిపై పెట్టిన బాధ్యతను పరిపూర్ణం చేయాలి. తెలంగాణ అసెంబ్లీలో పూర్తిగా ప్రజల ఆకాంక్షలే ప్రతిఫలించాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రతిపక్షాలను సర్కారును సరైన మార్గంలో నడిచేలా మార్గనిర్దేశనం చేయాలి. ఇది తెలంగాణ ప్రజలందరి ఆకాంక్ష.