జెడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి

6A

షరిషత్‌ల కైవసంపై కేసీఆర్‌ నజర్‌

హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) :

జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులను ఆదేశించారు. ఆదివారం ఆయన సీఎం క్యాంపు కార్యాలమంలో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణలోని తొమ్మిది జిల్లా పరిషత్‌లలో కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జెడ్పీ పీఠాలు టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. ఖమ్మంలో టీడీపీకి ఆధిక్యత లభించగా, నల్గొండలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ లభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చిన నేపథ్యంలో అక్కడ జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక పంచాయితీ కోర్టుకు చేరింది. ఈనేపథ్యంలో అక్కడ మినహా మిగతా ఎనిమిది పీఠాల్లో కనీసం ఏడు కైవసం చేసుకొని తీరాలని సీఎం మంత్రులను ఆదేశించారు. మెదక్‌ జిల్లాలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు తలా 21 మంది చొప్పున జెడ్పీటీసీలు గెలవగా తదనంతర పరిణామాల్లో కొందరు జెడ్పీటీసీ సభ్యులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇక వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తరపున 26 మంది, టీఆర్‌ఎస్‌ తరపున 18 మంది జెడ్పీటీసీలు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్‌రావు కాంగ్రెస్‌తో విభేదించి తన అనుకూలురైన ముగ్గురు జెడ్పీటీసీలతో టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలో కొండా దంపతులకు అనుకూలురైన మరో ముగ్గురు జెడ్పీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌ పంచన చేరారు. నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన దొంతి మాధవరెడ్డి వద్ద ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులుండగా ఆయన చివరికి ఎటు చేరుతారో తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో వరంగల్‌ జెడ్పీ పీఠం కూడా టీఆర్‌ఎస్‌ వశమయ్యే అవకాశాలున్నాయి. అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం టీఆర్‌ఎస్‌కు అనుకూలమైన పరిస్థితులు లేవు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు అత్యధిక జెడ్పీటీసీలున్నా అక్కడ టీడీపీకి తొమ్మిది మంది, బీజేపీకి ఇద్దరు జెడ్పీటీసీలు ఉన్నారు. వారిని తమవైపునకు తిప్పుకొని మహబూబ్‌నగర్‌ జెడ్పీపై గులాబీ జెండా ఎగురవేయాలని కేసీఆర్‌ మంత్రులను ఆదేశించారు. అలాగే వీలైనన్ని ఎక్కువ మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలని సూచించారు. మంత్రులు ఆటా వేడుకలు రద్దు చేసుకొని పరిషత్‌ ఎన్నికలపై దృష్టి సారించాలని హుకుం జారీ చేశారు.