నవాబ్‌ అలీ జంఘ్‌కు ఘన నివాళి

3

జలసౌధలో ఇంజినీర్స్‌ డే

తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్లు భాగస్వామ్యం కావాలి : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) :

తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణంలో ఇంజినీర్లు కలిసిరావాలని నీటిపారుదల శాఖ మంత్రి హారీశ్‌రావు అన్నారు. నవాబ్‌ అలీ జంగ్‌ 132వ జయంతి సందర్భంగా ఎర్రమంజిల్‌ జలసౌధలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.  ఎర్రమంజిల్‌లోని జలసౌధలో తెలంగాణ ఇంజినీర్స్‌ డే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ రాజ్యాన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేసిన నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించని విధంగా మన ప్రభుత్వం మొదటిసారి ఇంజినీర్స్‌ డే ను నిర్వహిస్తోందన్నారు.  వందేళ్ల క్రితమే నవాజ్‌జంగ్‌ ముందుచూపుతో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించారు. ఆయన తెలంగాణకు చేసిన మేలు మరవలేనివి. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇంజినీర్ల అవసరం ఎంతో ఉంది. తెలంగాణ ఇంజినీర్లు తెలంగాణలోనే ఉంటరు. అవసరమైతే సూపర్‌ న్యూమరీ పోస్టులను సృష్టించి మనవారి సేవలు మనకే ఉపయోగపడేలా చూస్తాం. అర్హతలను అనుసరించి ఇంజినీర్లందరికీ ప్రమోషన్లు వచ్చేలా చూస్తామని అన్నారు.  మన ప్రాజెక్టుల శిలాఫలకాలపై ఇంజినీర్ల పేర్లు కూడా పెడతామన్నారు. ఇంజినీర్ల సంఘాల భవనానికి 500 గజాల స్థలంతోపాటు రూ. 50 లక్షల నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సాగునీటి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. నవాబ్‌ అలీ జంగ్‌ హైదరాబాద్‌ రాజ్యంలో ఎన్నో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్‌, వైరా, డిండి, కడెం, నాగార్జునసాగర్‌, పోచంపాడు తదితర ప్రాజెక్టులకు జంగ్‌ రూపకల్పన చేశారు. అదేవిధంగా ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల భవనం, ఉస్మానియా ఆసుపత్రి, జూబ్లీహాల్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీల రూపశిల్పి నవాజ్‌ జంగ్‌. నవాబ్‌జంగ్‌ సేవలను గుర్తించిన రాష్ట్రంప్రభుత్వం ఇకనుంచి ప్రతిఏటా జూలై 11న తెలంగాణ ఇంజినీర్స్‌ డే గా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు ఆర్‌.విద్యాసాగర్‌రావు, కేవీ రమణాచారి, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్‌. విద్యాసాగర్‌రావును మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. అదేవిధంగా మంత్రిని ఇంజినీర్లు సన్మానించారు.