పుట్టిన రోజే పునర్జన్మ

4
మృతదేహాల అప్పగింతలో పొరపాటు

తమ బిడ్డగా భావించి అంత్యక్రియలు

పొరపాటుగా జరిగింది

తల్లిదండ్రులను ఓదార్చిన మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :

పుట్టిన రోజే ఓ బిడ్డకు పునర్జన్మ లభించింది. మీరు చదువుతున్నది నిజమే. మాసాయిపేట బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడనుకొని పసివాడి మృతదేహాన్ని ఖననం చేసిన తల్లిదండ్రులు తమ బిడ్డ బతికే ఉన్నాడని తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోయారు. అయితే ఈ ఘటన మరో కుటుంబంలో మాత్రం తీరని వేదనను మిగిల్చింది. తమ బిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సంతోషంగా ఉన్న ఆ కుటుంబం తమవాడు చనిపోయాడని తెలుసుకొని కన్నీరు మున్నీరయ్యారు. మాసాయిపేట దుర్ఘటనలో మృత్యువాతపడిన చిన్నారుల మృతదేహాల అప్పగింతలో జరిగిన పొరబాటే ఇందుకు కారణం. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద లెవెల్‌ క్రాసింగ్‌ దాటుతున్న స్కూలు బస్సును నాందెడ్‌ ప్యాసెంజర్‌ రైలు ఢీకొట్టడంతో 16 మంది చిన్నారులు సహా 18 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 14 మంది అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. అయితే, మృతి చెందిన చిన్నారుల  అప్పగింతలో గందరగోళం చోటు చేసుకుంది. ఇస్లాంపూర్‌కు చెందిన వీరబాబు కుమారుడు దత్తు, కిష్టాపూర్‌కు చెందిన స్వామిగౌడ్‌ కుమారుడు దర్శన్‌గౌడ్‌ అలియాస్‌ ధనూష్‌ గురువారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన కొంపల్లిలోని బాలాజీ ఆస్పత్రికి, అక్కడి నుంచి యశోదా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో దత్తు కన్నుమూశాడు.

ఊపిరిలూదిన ఫోన్‌ కాల్‌..

ప్రమాదంలో గాయపడిన కుమారుడి కోసం స్వామిగౌడ్‌ కుటుంబ సభ్యులు బాలాజీ ఆస్పత్రికి చేరుకున్నారు. అదే సమయంలో దర్శన్‌గౌడ్‌ మృతి చెందాడని వైద్యులు తెలపడంతో వారు బాలుడి మృతదేహాన్ని వెంట తీసుకెళ్లారు. కిష్టాపూర్‌లో ఖననం చేశారు. ఒక్కగానొక్క కొడుకు కన్నుమూశాడని స్వామిగౌడ్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం ఉదయం వారికి యశోదా ఆస్పత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ ఫోన్‌ కాల్‌ స్వామిగౌడ్‌ దంపతులకు ఊపిరులూదింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం స్పృహలోకి వచ్చిన దర్శన్‌గౌడ్‌ తన పేరు, ఊరు వివరాలు చెప్పడంతో వైద్యులు అతడి తండ్రికి ఫోన్‌ చేశారు. దర్శన్‌గౌడ్‌ బతికే ఉన్నాడని.. కోలుకుంటున్నాడని వైద్యులు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు. బాలుడ్ని చూసి తల్లిదండ్రులు దర్శన్‌గా గుర్తించారు. తండ్రిని చూసి బాలుడు నాన్న అని పిలవడంతో అతడు దర్శన్‌గౌడేనని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. చనిపోయింది దత్తుగా గుర్తించారు.

దిగ్భ్రమలో వీరబాబు కుటుంబం

అయితే ఇప్పటివరకు తమ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని భావించిన దత్తు తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకొని విషాదంలో మునిగిపోయారు. ఇస్లాంపూర్‌కు చెందిన వీరబాబు కుమార్తె భువన, కుమారుడు దత్తు కాకతీయ పాఠశాలలో చదువుతన్నారు. గురువారం స్కూలుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భువన అక్కడికక్కడే మృత్యువాత పడింది. కుమార్తె మృతితో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు ఆమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ కుమారుడు బతికి ఉన్నాడని తల్లిదండ్రులు కొంత స్వాంతన చెందారు. అయితే, దత్తు మృతి చెందాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది దర్శన్‌గౌడ్‌ అని తెలియడంతో వారు షాక్‌కు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో తల్లిదండ్రులు దిగ్భ్రమ చెందారు. కూతురు భువన మృతితో ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం.. దత్తు కూడా ఇక లేడని ఆలస్యంగా తెలియడంతో దిగ్భాంతికి గురైంది. కోటి ఆశలతో యశోదా ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్న వీరబాబు.. పూడ్చిన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు భారమైన హృదయంతో కిష్టాపూర్‌కు బయల్దేరారు.

మృతదేహం అప్పగింత

కిష్టాపూర్‌లో ఖననం చేసిన దత్తు మృతదేహాన్ని వెలికితీసి, ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. కలెక్టర్‌ శరత్‌ సమక్షంలో రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. స్వామిగౌడ్‌ కుటుంబం అనుమతితో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి వీరబాబు కుటుంబానికి అప్పగించారు. కిష్టాపూర్‌ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఆసక్తిగా గమనించారు. వీరబాబు కుటుంబాన్ని ఓదార్చేందుకు యత్నించారు. గుండెల నిండా విషాదం నింపుకొని వీరబాబు తన కుమారుడి మృతదేహాన్ని ఇస్లాంపూర్‌కు తీసుకెళ్లారు. దత్తును చివరిసారిగా చూసేందుకు గ్రామం మొత్తం తరలివచ్చింది. బాధాతప్త హృదయాలతో అంతిమ వీడ్కోలు పలికింది. కూతురు చనిపోయినా కుమారుడు బతికే ఉన్నాడన్న భరోసా ఆ కుటుంబానికి ఉండేదని.. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయిందని స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.

ఆతృతలో పొరపాటు: హరీశ్‌రావు

మృతదేహాల అప్పగింతలో పొరపాటు జరిగిందని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దర్శన్‌గౌడ్‌ కుటుంబ సభ్యుల ఆతృతతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. దత్తు మృతదేహాన్ని ఆయన తల్లిదండ్రులకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన శుక్రవారం పరమార్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దత్తు మృతదేహాన్ని చూసి స్వామిగౌడ్‌ కుటుంబ సభ్యులు ధనుష్‌గౌడ్‌ అని భావించారని.. తమ కుమారుడేనని చెప్పి మృతదేహాన్ని తమ సొంత కారులో తీసుకెళ్లారని చెప్పారు. దిగ్భ్రమలో ఉన్న స్వామిగౌడ్‌ తన కుమారుడేనని దత్తు మృతదేహాన్ని తీసుకెళ్లాడని వివరించారు. అయితే ధనుష్‌గౌడ్‌ స్పృహలోకి వచ్చి తన పేరు, తల్లిదండ్రుల వివరాలు చెప్పడంతో జరిగిన పొరపాటు వెలుగు చూసిందన్నారు. ఇవాళ ధనుష్‌ పుట్టిన రోజు అని.. అతడికి ఇది పునర్జన్మ అని చెప్పారు. విషయం తెలియగానే స్వామిగౌడ్‌, వీరబాబును కిష్టాపూర్‌ గ్రామానికి పంపించామన్నారు. కలెక్టర్‌, రెవెన్యూ అధికారుల సమక్షంలో తిరిగి పంచనామా జరిపి మృతదేహాన్ని అప్పగించనున్నట్లు చెప్పారు. ధనుష్‌గౌడ్‌ మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్లామని ఆయన తండ్రి స్వామిగౌడ్‌ తెలిపారు. గుర్తు పట్టని విధంగా ముఖం చిట్లిపోవడం బాలుడ్ని గుర్తించలేకపోయామని, తమ వల్లే పొరపాటు జరిగిందని ఆయన అంగీకరించారు. దత్తు మృతదేహాన్ని కిష్టాపూర్‌లో పూడ్చామని, వారి కుటుంబ సభ్యులకు పిల్లాడి మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. ఈమేరకు కలెక్టర్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి అప్పగించారు.