నల్గొండ ఫ్లోరోసిస్‌ కోరలు విరిస్తేనే వాటర్‌ గ్రిడ్‌కు సార్థకత

పవర్‌ గ్రిడ్‌, గ్యాస్‌ గ్రిడ్‌ ఇప్పుడు తెలంగాణలో సరికొత్తగా వాటర్‌ గ్రిడ్‌. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇప్పుడు జల విధానంతో ముందుకెళ్తున్నారు. విద్యుత్‌, గ్యాస్‌ సరఫరాకు గ్రిడ్‌ ఉన్నట్లే మంచినీటికి ఎందుకు ఉండకూడదు. సాగునీటికి ఓ విధానం అంటూ ఉన్నప్పుడు తాగునీటికి కూడా ఉండాలి. వాటర్‌ బ్యాంక్‌ అనేది ఉంటే నీటిని పంపిణీ చేయడం సులువు. ఇలా ఉన్న నీటిని నిల్వ చేసుకోవడం ఆ తరవాత దానిని వినియోగించుకోవడం అన్న ఆలోచన ఓ అద్భుతమైన ప్రణాళికగా భావించాలి. ఈ ఆలోచనకు కార్యరూపం వస్తే ప్రపంచానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకాలం బోర్లపై ఆధారపడుతూ భూమిని గుల్లచేస్తూ ఫ్లోరైడ్‌ బారిన పడుతున్న ప్రజలకు ఇది నిజంగా ఉపశమనం కలిగించే అంశం. దీనివల్ల తాగునీరే కాకుండా సాగునీరు కూడా అందుబాటులోకి వస్తుంది. విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. వ్యవసాయం పెరుగుతుంది. మొత్తంగా గ్రావిూణ అర్థిక వ్యవస్థ రూపురేఖలు మారనున్నాయనడంలో సందేహం లేదు. గ్రామాల్లో గతంలో ఉన్న చెరువులన్నీ అదృశ్యం అవుతున్నాయి. గొలుసుకట్టు చెరువలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఉన్న చెరువుల సామర్థ్యం దెబ్బతింది. వీటన్నిటిని గ్రిడ్‌ పరిధిలోకి తీసుకుని వచ్చి వాటిని నీటి ద్వారా నింపగలిగితే గ్రామాల మంచినీటి సమస్యతో పాటు, సాగునీటి సమస్యా తీరుతుంది. ఇలా నీటిని సక్రమంగా వాడకం చేయడం వల్ల విద్యుత్‌ భారం కూడా తగ్గుతుంది. ఇలాంటి ఆలోచన రావడం నిజంగా అభినందనీయం. వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన వల్ల గ్రామాలకు మంచినీటి సమస్య తీరనుంది. ఇందుకోసం తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని రూ.25వేల కోట్ల నుంచి 30వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా లక్ష కిలోవిూటర్ల మేర పైపులైన్లు విస్తరిస్తామని తెలిపారు. ఇందుకు మొత్తంగా 160 టీఎంసీల నీరు అవసరమవుతుందని, గోదావరి, కృష్ణా నదులనుంచి 80 టీఎంసీల చొప్పున తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధంచేశామని చెప్పారు. అయితే దీనికి నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఈ ఆలోచనకు అనుగుణంగా నిధుల సేకరణ చేస్తే పథకం వేగంగా ముందుకు సాగుతుంది. గుజరాత్‌లో ఈ తరహా ప్రాజెక్టు అమలవుతుందని చెప్పిన సీఎం త్వరలోనే రాష్టాన్రికి చెందిన ఎమ్మెల్యేలు, అధికారుల బృందం ఈ పథకాన్ని పరిశీలించడానికి అక్కడికి  వెళుతుందని ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌, దక్షిణ తెలంగాణలో నల్లగొండ, తూర్పు తెలంగాణలో ఖమ్మం, పశ్చిమ తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లాల్లో ఒకే రోజు పనులకు శంకుస్థాపనలు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రధాన ఫౌండేషన్‌ను తాను స్వయంగా నల్గొండ జిల్లాలో వేస్తానని ప్రకటించారు. ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి, గ్రావిూణ ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం వల్ల పథకం వేగంగానే రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వివిధ పథకాల కింద కొనసాగుతున్న మంచినీటి పథకాలన్నింటినీ దీనిలోనే విలీనం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులో మంచినీటికి, సాగునీటిని పరిశ్రమలకు వినియోగించేలా నిర్ణయం తీసుకున్నామని, కాబట్టి గ్రిడ్‌ పథకంలో భాగంగా ఎక్కడ నీటి లభ్యత ఉంటే అక్కడి నుంచి తీసుకొని ప్రజలకు సరఫరా చేస్తామని ప్రకటించారు. ఇది అమలయితే నీటికి సంబంధించి భవిష్యత్‌లో సమస్యలు ఉండవు. అయితే నీటి సమస్య లేకుండా ఈ పథకాన్ని చెరువులతో అనుసంధానం చేస్తే మరింత ప్రయోజనకారిగా ఉంటుంది.

నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ కోరల ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఎందరో పసి బిడ్డలు ఫ్లోరోసిస్‌ బారిన పడి కాళ్ళుచేతులు కోల్పోతున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఒకప్పుడు పొంగిపొర్లిన వాగులన్నీ ఇప్పుడు మాయమయ్యాయి. వీటన్నటిని పునరుద్దరించి నీటిని ఒడిసిపట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు ప్రజల భాగస్వామ్యం పెంచాలి. మనకు గోదావరి బేసిన్లో సమృద్ధిగా నీరుంది. వాగులు వంకలు, చెలిమెలు వట్టిపోకుండా చూసుకోవాలి. దీనివల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. మంచినీటి వనరులను, సాగునీటి వనరులను అనుసంధానం చేస్తూ పోతే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది. అలాగే కరెంట్‌ కష్టాలు కూడా సగం వరకు తీర్చిన వారం అవుతాం. ఈ సమస్యలను ఉమ్మడిగా పరిశీలించాల్సి ఉంది. మంచినీటి సరఫరా గ్రిడ్‌ ఏర్పాటు తెలంగాణ అభివృద్దిలో ఓ మైలు రాయి కావాలి. ఈ ప్రాజెక్టుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల కోట్లు అవసరమవుతాయి. దీంతో నాలుగేళ్లలో మంచినీరు దొరకని గ్రామం అంటూ తెలంగాణలో ఉండదు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలుచేసి తెలంగాణ ప్రజలందరికీ నీరందించాలి.