9న ఆదివాసీ గర్జనతో కదలిక రావాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి):ఈ నెల 9న నిర్వహించే ఆదివాసీ గర్జన ద్వారా తమ ఆందోళనలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపిస్తామని తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడప నగేష్‌ అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకు ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని అన్నారు. సదస్సుకు హాజరయ్యే ఆదివాసీల వాహనాలకు దారి చూపడంతో పాటు శాంతియుతంగా గర్జన జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉంటుందని అన్నారు. విధినిర్వహణలో లేని లంబాడీ ఉపాధ్యాయులకు నవంబరు నెల వేతనాలు చెల్లించడం చట్ట ధిక్కరణ కిందకు వస్తుందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లంబాడా ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించే డీడీఓలు పీసా చట్టం లోని సెక్షన్‌ 244(1) ను ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాన్ని దిక్కరించే డీడీఓల పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. పీసా యాక్టులోని సెక్షన్‌ 244(1) ప్రకారం ఆదివాసీ గ్రామాల్లో చేసిన తీర్మానాలను దిక్కరించే అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి ఆదివాసీ గిరిజనులు భారీ సంఖ్యలో తరలి రావాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల్లో ఆదివాసీ గిరిజనుల్లోని అన్ని కులాలకు చెందిన కొంతమందితో ఉద్యమ సలహా కమిటీలను ఏర్పాటు చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ ఉద్యమాన్ని శాంతియుతంగానే నిర్వహించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ఆదివాసీ గిరిజనులకు కల్పించిన హక్కులు దక్కించే వరకూ తమ ఉద్యమాన్ని నిర్వహిస్తూనే ఉంటామన్నారు.