92 మంది జల సమాధి

tu-154-planeమాస్కో నుంచి సిరియా వెళుతున్న రష్యా సైనిక విమానం నల్లసముద్రంలో కుప్పకూలింది. మృతుల్లో నూతన సంవత్సర వేడుకల్లో కచేరీ జరిపేందుకు బయలుదేరిన కోయర్ గాయకబృందం, కొందరు జర్నలిస్టులు, సైనికులు ఉన్నారు. ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.భారత ప్రధాని నరేంద్రమోదీ విమాన దుర్ఘటనపై సంతాపం తెలిపారు.

మాస్కో, డిసెంబర్ 25: సిరియా వెళ్తున్న రష్యా సైనిక విమానం కూలిపోయిన ఘటనలో అందులోని 92 మంది ప్రయాణికులు మరణించారు. ఆదివారం దక్షిణ రష్యాలోని ఆడ్లర్ నుంచి సిరియాలోని మేమిం వైమానిక స్థావరానికి బైలుదేరిన ఆ విమానం నల్లసముద్రంలో కూలిపోయింది. మృతులలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనేందుకు వెళ్తున్న 60 మంది బృందగాయకులు కూడా ఉన్నారు. ఈ ఘటనపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని డిమిట్రీ మెద్వెదేవ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. టెలివిజన్‌లో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ శనివారం దేశవ్యాప్తంగా సంతాపదినం పాటించనున్నట్టు పుతిన్ ప్రకటించారు. 92 మంది ప్రాణాలను బలిగొన్న విమాన దుర్ఘటనపై ప్రధాని మోదీ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన విమానం సోచి సమీపంలోని ఆడ్లర్ నగరంలో ఇంధనం నింపుకొనేందుకు ఆగింది.