అచ్చు సినిమాలాగే హీరోయిజం

share on facebook

క్లైమాక్సే రివర్స్‌ అయ్యింది
సాహసించిన ప్రేమికుడు పోలీస్‌ స్టేషన్‌కు
లక్నో,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి చెడగొట్టి తరవాత ఆ అమ్మాయిని ఎత్తుకుని పోవడం సినిమాల్లో చూస్తుంటాం. అయితే అక్కడ కథ సుఖాంతమైనా నిజజీవితంలో అలాంటి సీన్‌ ఒకటి చోటు చేసుకుంటి. కాకపోతే క్లైమాక్స్‌లో మాత్రం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పెళ్లిమండపంలోకి హీరో బైక్‌పై దూసుకొచ్చేసి పెళ్లికూతురుని తీసుకుని వెళ్లడం సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని నాగినా జిల్లాలో నిజంగా సినిమా తరహాలోనే జరిగింది. పెళ్లి కూతురు మండపంలో కూర్చొని ఉండగా ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వచ్చి తనతోపాటు తెచ్చుకున్న పూలదండను నేరుగా పెళ్లికూతురుపైకి విసిరాడు. అది కూడా సరిగ్గా వెళ్లి ఆమె మెడలో పడింది. దీంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. అంతా ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే.. వెంటనే ఆ వధువు కూడా మండపంలో నుంచి లేచి వచ్చి తనపై మాల వేసిన వ్యక్తి మెడలో పూలదండ వేసింది. అసలు ఏం జరుగుతోంది.. అని ఆ పెళ్లికి వచ్చిన బంధువులు  అలా కాసేపు చూస్తుండిపోయారు. ఆ తర్వాత పెళ్లిమండపంలో ఉన్న వరుడి తరఫు బంధువులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అతడిని కాపాడాల్సి వచ్చింది. వరుడి కుటుంబసభ్యులు వివాహ కార్యక్రమాన్ని నిలిపేసి మండపం నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లికూతురు, బైక్‌ వచ్చిన యువకుడు కలిసి చదువుకున్నారు. వారిద్దరు ప్రేమించుకోగా.. వారి కులాలు వేరే కావడంతో ఇరు కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించ లేదు.  దీంతో వేరే వ్యక్తితో ఆమె పెళ్లి జరుగుతుండగా ఆ యువకుడు మధ్యలో పెళ్లిమండపంలోకి వచ్చి పూలమాల వేసి నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటనతో పెళ్లి పెటాకులు అయింది. వధువు బంధువుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు యుకుడిని అదుపులోకి తీసుకొని పిఎస్‌ తరలించారు.

Other News

Comments are closed.