అతిగా ఊహించుకుంటున్న కాంగ్రెస్‌

share on facebook

ఎన్నికలు ముందు జరిగినా, తరవాత జరిగినా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వానికి ఇవి పరీక్ష కానున్నాయి. కేవలం కెసిఆర్‌ను విమర్శించడం ద్వారానే అవి ఎన్నికలకు వెళ్లాలి తప్ప తమ ఘనత ఫలానా ఉందంటూ చెప్పుకోవడానికి కాంగ్రెస్‌కు ఒక్క చిన్న అవకాశం కూడా లేదు. రాహుల్‌ను ప్రధాని చేయడం అన్న తోక ఒకటి తగిలించుకుని పోవడం మరో ఆకర్శణగా భావిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్‌ ఏనాడూ ఓ మంచి పని చేసిన దాఖలా లేదు. అలాగే కుమ్ములాటలు వారి సొంత ఎజెండా. అంతకుమించి అందరూ సిఎం అభ్యర్థులే. గట్టిగా నిలబడి ఒకరు మరొకిరిని గెలిపించే సత్తా లేని నాయకులు వారు. తమసీట్లను కూడా గెల్చుకోలేని బలం వారిది. ఏ కారణంగా అయినా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికల ప్రచారానికి రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ అత్యధిక సమయం కేటాయించేలా నేతలు ప్రయత్నాలు చేయవచ్చు. కేద్రంతో కలసి ఎన్నికలు రావాలని వీరు కోరుకోవడం లేదు. ప్రత్యేకంగా ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ అధినాయకులు తెలంగాణపై ఎక్కువ దృష్టి పెడతారని, వారి ప్రచారం కలసి వస్తుందన్న భావనలో ఉన్నారు. ఇకపోతే తెలంగాణలో బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లు ఈ పర్యాయం కాంగ్రెస్‌ గెలుపు కోసం గట్టిగా కృషిచేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే చాపకిందనీరులా మరోమారు ఈ సామాజిక వర్గం పావులు కదుపుతోంది. అందుకే శాసనసభకు ముందస్తుగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం పెద్దలు రాష్ట్రంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో విజయావకాశాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానంలో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నట్టు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పట్ల అంత సానుకూలత లేదని కాంగ్రెస్‌ నాయకత్వం అంచనాగా ఉంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని, అదే తమను ఒడ్డుకు చేరుస్తుందని ధీమాగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఆలోచనా ధోరణిని గమనించిన కేసీఆర్‌, బీసీలను మచ్చిక చేసుకోవడానికి వివిధ పథకాలను ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని కార్యక్రమాలు దాదాపుగా వారిని దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఎన్నికలకు ఒంటరిగానే వెళ్ళాలని,ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదనీ కేసీఆర్‌ తేల్చివేశారు. మోడీతో సఖ్యతగా ఉంటున్నా ఎన్నికల్లో బిజెపితో కలసి పోరాదన్న భావనలో ఉన్నారు. ఒకవేళ అలా వెళితే తన ముస్లిం ఓటుబ్యాంక్‌ గండిపడగలదన్న భావనలో కెసిఆర్‌ ఉన్నారు. తాజావర్తమాన పరిస్థితులు, ఎపి సిఎం చంద్రబాబు వ్యవహారశైలి చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో కలవక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీచేస్తే అధికారపక్షానికి గట్టి పోటీ ఎదురవుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్‌కు నాయకుడు ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించక పోతే ఈ సమస్య ఆ పార్టీని వేధిస్తూనే ఉంటుంది. గత ఎన్నికలలో బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం వల్లనే కాంగ్రెస్‌ ఓడిపోయింది. శాసనసభ ఎన్నికలలో ఎలాగోలా గట్టెక్క గలిగితే ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సాధించడానికి అవకాశాలు బలంగా ఉంటాయని కాంగ్రెస్‌ అధిష్ఠానం అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌ ఒంటరిగా కాకుండా తెలుగుదేశంపార్టీతో జత కడితే గెలుపు కోసం టిఆర్‌ఎస్‌ చెమటోడ్చక తప్పదని పార్టీలోని కొందరు భావిస్తున్నారు. టిడిపికి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. వారంతా టిఆర్‌ఎస్‌లో చేరలేదు. అయితే తెలుగుదేశంపార్టీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రవేసి ప్రచారం తిప్పి కొట్టాలన్నది టిఆర్‌ఎస్‌ వ్యూహంగా ఉంది.

తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేయాలనుకుంటున్న సీపీఐ కోరిక నెరవేరే అవకాశం

కనిపించడం లేదు. లెఫ్ట్‌ పార్టీలు కూడా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌ కూటమిలో చేరక తప్పనిస్థితి కనిపిస్తోంది. సిపీఎం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి సొంత ఎజెండాతో ముందుకు వెళుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జన సమితి కలిసి పోటీ చేసేలా ఉమ్మడి ఎజెండాతో పోవాలని ఇంటి పార్టీ నాయకుడు చెరుకు సుధాకర్‌ లాంటి వారు కోరకుంటున్నారు. అలాంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇన్ని పార్టీలకు సీట్ల పంపకం కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారుతుంది. కాంగ్రెస్‌లోనే ఆశావహులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది కనీసం 23 నుంచి 30 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడం అంటే కాంగ్రెస్‌ నాయకత్వానికి కత్తి విూద సామే అవుతుంది. అయినా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని చూస్తోంది. ఈ దశలో ఎజెండా కేవలం కెసిఆర్‌..టిఆర్‌ఎస్‌ తప్ప ప్రగతిశీల పథకాలు లేవు. దశాబ్దం క్రితం కూడా ఎలాంటి పురోగతి లేదు. ఇలాంటి సందర్భంలో విపక్షాలుకూడా కేవలం కెసిఆర్‌పై వ్యతిరేకతతోనే కలసి పోవడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ కూటమికి సంబంధించి కామన్‌ ఎజెండా ఉంటుందా లేక ఎలా ప్రజల వద్దకు వెళతారన్నది కూడా అనుమానమే. అన్నింటికి మించి కాంగ్రెస పార్టీ పెద్ద మైనస్‌గా భావించాలి. ఆ పార్టీలో గట్టి నాయకుడన్న వాడు లేడు. ఉన్నవారి పట్ల ప్రజలకు విశ్వాసం లేదు. ఈ దశలో వీరు అధికార పార్టీని, సిఎం కెసిఆర్‌ను ఎలా ఢీకొంటారన్నది చూడాలి.

 

Other News

Comments are closed.