అత్యధిక వ్యూస్‌ వచ్చిన టాప్‌ 10లో ‘మహానటి’ 

share on facebook

హైదరాబాద్‌: అలనాటి తార సావిత్రి జీవితాధారంగా వచ్చిన ‘మహానటి’ చిత్రం అత్యధిక వ్యూస్‌ వచ్చిన టాప్‌ 10 భారతీయ చిత్రాల్లో స్థానం సంపాదించింది. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌) విడుదల చేసిన 2018 మోస్ట్‌ వ్యూడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాలో ‘మహానటి’ నాలుగో స్థానంలో నిలిచింది. వెబ్‌సైట్‌లో సినిమాలకు వచ్చిన పాపులారిటీ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఐఎండీబీ వెల్లడించింది. ఒక సినిమాకు మొబైల్‌, వెబ్‌ ఆడియన్స్‌ నుంచి ఎన్ని వ్యూస్‌ వచ్చాయన్న ఆధారంగా ర్యాంకింగ్స్‌ ఇచ్చింది.

‘మహానటి’ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించారు. సమంత, విజయ్‌ దేవరకొండ విలేకర్లుగా కీలక పాత్రలు పోషించారు. మోహన్‌బాబు, దుల్కర్‌ సల్మాన్‌, అవసరాల శ్రీనివాస్‌, ప్రకాశ్‌రాజ్‌, క్రిష్‌ జాగర్లమూడి, షాలిని పాండే, నాగచైతన్య అతిథి పాత్రల్లో మెరిశారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్విని దత్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ ఏడాది మే 11న విడుదలైన ‘మహానటి’ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

టాప్‌ 10 భారతీయ చిత్రాలివే..
1. అంధాధున్‌ (హిందీ)
2. రాక్షసన్‌ (తమిళం)
3. 96 (తమిళం)
4. మహానటి (తెలుగు)
5. బధాయి హో (హిందీ)
6. ప్యాడ్‌మ్యాన్‌ (హిందీ)
7. రంగస్థలం (తెలుగు)
8. స్త్రీ (హిందీ)
9. రాజి (హిందీ)
10. సంజు (హిందీ).

Other News

Comments are closed.