అన్నదాతకు అండగా సహకార రుణాలు

share on facebook

రైతుల అవసరాలకు అనగుణంగా ప్రణాళిక
సంగారెడ్డి,అక్టోబర్‌4 (జనంసాక్షి):   ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం చేస్తూనే
వాటి ద్వారా రైతులకు లబ్ది దక్కేలా చూడనున్నారు. పీఏసీఎస్‌లో సభ్యుడిగా ఉన్న జిల్లాలోని ప్రతి సభ్యుడికి కనీసం రూ.5 వేలు రుణం అందించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.పంట సాగు చేసే సమయంలో ఎరువులు, విత్తనాల కోసం అన్నదాతలు వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వీరి అవసరాన్ని అవకాశంగా చేసుకుని  వాటిని అందించి పంట చేతికొచ్చాక అధిక వడ్డీలతో అసలు మొత్తాన్ని వసూలు చేస్తారు. దీనివల్ల చాలామంది అన్నదాతలు అష్టకష్టాలు పడుతుంటారు. ఈ సమస్యను గుర్తించిన జిల్లా యంత్రాంగం వారికి అండగా నిలిచేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో ప్రస్తుతం 52 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. డీసీసీబీ ఆధ్వర్యంలో పనిచేసే 33 సంఘాల్లో ఉన్న సభ్యులకు ప్రతి ఒక్కరూ రుణ సదుపాయంపొందేలా చూడనున్నారు. చాలామంది అన్నదాతలు సంఘాల్లో సభ్యులుగా ఉంటున్నప్పటికీ వారు మాత్రం వడ్డీ వ్యాపారుల వద్ద, ఇతరత్రా బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. పీఏసీఎస్‌లలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం లేదు. ఇలాంటి వారిని గుర్తించి ప్రతి సభ్యుడూ కచ్చితంగా ప్రయోజనం పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సభ్యులందరికీ రూ.5 వేలు రుణ సదుపాయం కల్పించనున్నారు. నగదును రైతుకు నేరుగా ఇతరత్రా ఖర్చుల కోసం ఉపయోగించుకునేందుకు ఇవ్వరు. పీఎసీఎస్‌కు వెళ్లి రూ.5 వేల వరకు విలువైన ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తారు. ఆ మొత్తాన్ని ఆయన ఖాతాలో అప్పుగా చూపుతారు. తిరిగి పంట పండిన తర్వాత అప్పును రూ.5 వేలతోపాటు రూ.300 చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల పెట్టుబడుల కోసం రైతులు పడే ఇబ్బందులను తగ్గించవచ్చనే కోణంలో అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక బయట వ్యాపారులతో పోల్చితే ఎరువులు తక్కువ ధరకే పీఎసీఎస్‌లలో అందుబాటులో ఉంటాయి.  ఇలా రుణం పొందడానికి ముందుకొచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు ఈ వివరాలను డీసీసీబీకి అందించి వారికి సాయం అందించేలా చూస్తామని సహకార శాఖ అధికారులు వివరిస్తున్నారు.  వాస్తవానికి బయట వ్యాపారులతో పోల్చితే ఎరువులు ఇక్కడే తక్కువ ధరకు వస్తాయి. ఈ విషయాలనూ అన్నదాతలకు వివరించి సంఘాలనూ బలోపేతం చేసేందుకు వీరి సేవలను వాడుకోనున్నారు. ఇలా ఈ వానాకాలంలో రైతన్నకు అండగా నిలిచేలా వ్యవసాయ, సహకార శాఖలు సంయుక్తంగా కార్యకలాపాలు చేపట్టనున్నాయి.

Other News

Comments are closed.