అన్నా క్యాంటీన్లు మూసేయలేదు

share on facebook

– ఓ లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది
– ఎన్నికల ప్రచారంకోసమే క్యాంటీన్లను వాడుకున్నారు
– రాష్ట్రంలో 183 క్యాంటీన్లు నడుస్తున్నాయి
– రంగుమార్చితే పథకం రద్దుచేసినట్లు కాదు
– పీఏంఏవై పథకం కింద పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు
– అసెంబ్లీలో  మంత్రులు బొత్స సత్యనారాయణ
– ఫైబర్‌ గ్రిడ్‌ అవినీతిపై విచారణ జరిపిస్తాం
– మంత్రి గౌతమ్‌ రెడ్డి
అమరావతి, జులై30 (జనం సాక్షి)  : టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూసివేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఏపీ శాసనసభ సమావేశాలు వాడివేడిగాసాగాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు వైసీపీ సభ్యులు ఫైబర్‌గ్రిడ్‌, అన్నా క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అధికార పార్టీ సభ్యుడు రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘అన్నా క్యాంటీన్ల’ అవకతకలను సభలో ప్రస్తవించారు. అన్నా క్యాంటీన్లను పెట్టి టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని, వాటిని ప్రక్షాళన చేయాలని కోరారు. ఈ క్యాంటీన్ల పేరిట టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారని, ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్ససత్యనారాయణ మాట్లాడుతూ.. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అన్నా క్యాంటీన్లను మూసివేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం హడావుడిగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని, మార్చురీ పక్కన కూడా పెట్టారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిపై పూర్తి ప్రక్షాళన జరిపి ప్రజలకు మేలు చేకూర్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు బోత్స తెలిపారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయన్నారు.  మరోవైపు ఇండ్ల నిర్మాణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఏంఏవై) కింద 7లక్షల ఇళ్లను మంజూరు చేసుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టిందని బొత్ససత్యానారాయణ తెలిపారు. 3లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టినప్పటికి ఒక్క ఇళ్లు కూడా లబ్దిదారుడికి అందలేదన్నారు. 300,325,430 ఎస్‌ఎప్టీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. వీటి నిర్మాణానికి షేర్‌వాల్‌ టెక్నాలజీకి గరిష్టంగా చదరపు అడుగుకు రూ.2,311 చెల్లించారని తెలిపారు. ఈ తరహా విధానాలతో పేదలపై రుణభారం పడిందన్నారు. గృహ నిర్మాణంలో మూడు కంపెనీలకే అత్యధిక కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారని, వీటిపై రివర్స్‌ టెండరింగ్‌ వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ పాదయాత్రలో చెప్పిన విషయాలు వాస్తవమని తెలిపారు. ఈ విషయంలో సభ్యులకు సందేహాలుంటే సంబంధిత ్గ/ల్స్‌ కూడా చూపిస్తామన్నారు. పీఏంఏవై పథకం కింద పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.
ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతిపై విచారణ జరిపిస్తాం – మంత్రి గౌతమ్‌రెడ్డి
ఫైబర్‌ గ్రిడ్‌ పేరిట జరిగిన వందల కోట్ల అవినీతి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.. గత ప్రభుత్వం తన అనుయయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందన్నారు. రూ.149లకే టీవీ, ఇంటర్నెట్‌, ఫోన్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రచారం చేశారని,
సెటాప్‌ బాక్స్‌లకు రూ.5 వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్లో అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కిందని, ట్రాయ్‌ రూల్స్‌ విరుద్ధంగా వ్యవహరించిందని ఆర్కే తెలిపారు. ఈవీఎం చోరీ కేసులో నిందితుడికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టిందని, జగన్‌ పాదయాత్ర ప్రజల్లోకి వెళ్లకుండా గత ప్రభుత్వం కుట్ర చేసిందన్నారు. బహిరంగ సభలు ప్రజలు చూడకుండా కేబుల్‌ ప్రసారాలు నిలిపేసిందని ఆరోపించారు. ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తామని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా కమ్యునికేషన్‌ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చంద్రబాబు భావించారని మంత్రి రాజేంద్రనాథ్‌ అన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ కేబుల్‌ డ్యామేజ్‌ అయితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టమని బాబే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఏ స్కీమ్‌ చూసినా వేల కోట్ల అవినీతే కనబడుతుందని, ఫైబర్‌ గ్రిడ్‌పై విచారణ జరిపిస్తామన్నారు.
విలేజ్‌ మ్యాప్‌లు మిస్సయ్యాయి – మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌
విలేజ్‌ మ్యాప్‌లు చాలా మిస్సయ్యాయని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. అసెంబ్లీలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. 11158 గ్రామాలకు సర్వేయర్లను నియమిస్తున్నామని పేర్కొన్నారు. రీ సర్వేపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. 2023 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. అనంతపురం జిల్లాలో ఉద్యానవన రైతులకు నీటి సౌక్యం లేదని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యాన పంటలకు సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. గతంలో రెయిన్‌ గన్ల పేరుతో నిధులు వృథా చేశారన్నారు. ఉద్యానవన రైతులను ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు. రైతుకు 8 నుంచి 10 ట్యాంక్‌ల వరకు నీటిని అందిస్తున్నామన్నారు. రైతు నష్టపోతే తిరిగి మళ్లీ పంట వేసుకునేలా చూస్తామన్నారు. చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నామన్నారు.

Other News

Comments are closed.