అభివృద్దిలో తనదైన ముద్ర వేసిన రాజీవ్‌గాంధీ హన్మంతు

share on facebook

క్షేత్రస్థాయి అవగాహనతో ముందుకు వెళ్లిన కలెక్టర్‌

అందరినీ కలుపుకుని పోవడం ఆయనకు ప్రత్యేకం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌29(జ‌నం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం కొత్త జిల్లాగా ఏర్పాటైన తరవాత కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రాజీవ్‌గాంధీ హన్మంతు జిల్లాపై తనరదైన ముద్ర వేశారు. అభివృద్దిలో దూసుకుని వెళ్లారు. జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాకు పరిపాలన వ్యవహారాలు ఎంతో సవాల్‌గా మారిన తరుణంలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయంతో నడిపిస్తూ, ప్రజాప్రతినిధులందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించారు. కొత్తగూడెంజిల్లాగా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన రాజీవ్‌గాంధీహన్మంతు కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. ఐఏఎస్‌ అధికారిగా ఆసీఫాబాద్‌లో సబ్‌ కలెక్టర్‌గా తొలిపోస్టింగ్‌తో పనిచేసి తరువాత వరంగల్‌ జిల్లాలో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. 2016లో భధ్రాచలం ఐటీడీఏ పీవోగా నియమితులై గిరిజన సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 2016 అక్టోబర్‌ 11వ తేదీ నుంచి కలెక్టర్‌గా విధులునిర్వహిస్తూ అందరి మన్ననలు పొందారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్‌ కాకతీయలో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనులను వేగవంతంగా పూర్తి చేసి, 12,500 ఎకరాలను స్థిరీకరణ చేయడంలో తనవంతు కృషి చేసారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను పురోగతిలో పడేలా చేశారు. అధికార యంత్రాంగంతో పనులను తక్కువ సమయంలో పూర్తి చేయించి మిషన్‌ కాకతీయలో జిల్లాకు బెస్ట్‌ ఎక్స్‌లెన్సీ అవార్డును అందించారు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన గృహాలతో పాటు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గృహాలు, ప్రారంభమైన గృహాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న, రూ.7926 కోట్లతో చేపట్టిన శ్రీసీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. సీతారామ ప్రాజెక్టుతో పాటు భద్రాచలం- కొవ్వూరు రైల్వే లైన్‌ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ పక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఐటీడీఏలో గిరిజన దర్బార్‌ను ప్రవేశపెట్టి గిరిజనుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు.

 

Other News

Comments are closed.