అభివృద్ది ఆగిపోకూడదంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి

share on facebook

కెసిఆర్‌ సిఎం అయితేనే సంక్షేమం ముందుకు

ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న జలగం

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్‌6(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని కొత్తగూడెం నియోజకవర్గం టీఆర్‌ ఎస్‌ అభ్యర్థి జలగం వెంకటరావు అన్నారు. పట్టాలకెక్కిన అభివృద్ది ముందుకు సాగాలంటే సిఎంగా కెసిఆర్‌ మళ్లీ రావాల్సి ఉందన్నారు. మహాకూటమి నేతలను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరవాతనే పేదల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పథకాలను ప్రవేశపెట్టిందని జలగం అన్నారు. మంగళవారం జలగం పలు కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. శాశ్వత తాగునీటి పరిష్కారానికి గాను మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మరో నెల రోజుల్లో తప్పని సరిగా అందుతుందని అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఇంటికి గోదావరి, కిన్నెరసాని తాగునీరు 24 గంటల పాటు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తనపై విశ్వాసం ఉంచి మళ్లీ నాకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో ఇంకా బాగా అభివృద్ధి చేసి చూపిస్తానని వారికి హవిూ ఇస్తూ ఓట్లను అభ్యర్థించారు. జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్‌ ఓటమి భయంతోనే మహా కూటమి ఏర్పాటు చేసిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు మళ్లీ పట్టం కట్టబోతున్నారని, కేసీఆర్‌ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ 15 ఏళ్లు, కాంగ్రెస్‌ 45 సంవత్సరాలు అధికారంలో ఉండి చేయాలేని అభివృద్ధిని, సంక్షేమపథకాలను సీఎం కేసీఆర్‌ నాలుగేండ్ల లోనే చేసి చూపారన్నారు సంక్షేమ పథకాలు చేపట్టి ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులను రాజును చేయడానికి రైతు బంధు, రైతుబీమా పథకాలు, ఉచితంగా 24 గంటల కరంటు అందిస్తున్నారని తెలిపారు. తనను మళ్లీ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హావిూ ఇచ్చారు.

 

 

Other News

Comments are closed.