అశ్విన్‌ తీరు క్రీడాస్పూర్తికి విరుద్దం

share on facebook

– ఆస్టేల్రియన్‌ మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌
జైపూర్‌, మార్చి26(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరించారని రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ షేన్‌వార్న్‌ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ను ఔట్‌ చేసేందుకు అశ్విన్‌ మన్కడింగ్‌ విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ కీలక సమయంలో బట్లర్‌ వికెట్‌ కోల్పోవడం అందిరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. క్రీడాభిమానులు, క్రికెటర్లు అశ్విన్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆస్టేల్రియా స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ సైతం అతడిపై మండి పడ్డాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్‌ నిరాశపరిచాడని వార్న్‌ పేర్కొన్నాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ ఐపీఎల్‌ నిబంధనలకు లోబడి ఆడాలన్నాడు. ఆ సమయంలో అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్‌ను రనౌట్‌ చేశాడని.. దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణించాల్సి ఉండేదని వార్న్‌ పేర్కొన్నారు. ఐపీఎల్‌లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసికస్థితిని చెడగొడుతుందని, అన్నిటికంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని వెల్లడించాడు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అశ్విన్‌ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Other News

Comments are closed.