అసంఘటితరంగ కార్మికులకు అందని సంక్షేమ పథకాలు

share on facebook

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అసంఘటిత రంగంలో కార్మికులకు నేటికీ ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. నిత్యకూలీలకు జీవితం దినదినగండంగా మారింది. తెలుగు రాష్టాల్ల్రో అసంఘటిత రంగంలోని కార్మికుల పరిస్థితి దయనీయంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు పలు వర్గాల వారికి ప్రమాద బీమా పథకాలను అమలులోకి తెచ్చాయి. సంక్షేమ రంగాల్లోనే ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 46 లక్షల కార్మికులకు, తెలంగాణలో 32 లక్షలమందికి బ్యాంకు ఖాతాలే లేవు. ఉపాధి హావిూ కార్మికులు, నిర్మాణ రంగంతో పాటు వ్యవసాయాధారిత వృత్తులపై ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నారు. వ్యవసాయం, సేవారంగం, స్వయంఉపాధి వంటి అసంఘటిత రంగాల్లో పెద్దసంఖ్యలో కార్మికులున్నారు. ఉపాధి హావిూ కూలీలు, నిర్మాణ రంగంలోనివారు, ఇళ్లల్లో పని మనుషులు, పారిశుద్ధ్య కార్మికులు, వీధి వ్యాపారులు, ఆటో, టాక్సీ, లారీ డ్రైవర్లు, రిక్షా కార్మికులు… ఇలా ఎక్కడ చూసినా దేశంలో అసంఘటిత కార్మికులే కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్మిక చట్టాలు బలంగా ఉన్నాయి. వారి సంక్షేమానికి సంస్థాగత వ్యవస్థలున్నాయి. కానీ మనదగ్గరే వారికి అండదక్కడం లేదు. తమకు వచ్చే వేతనాలను నగదు రూపేణా పొందడం, వాటితోనే లావాదేవీలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఎక్కువగా ప్రైవేటు అప్పులపై ఆధారపడటమూ బ్యాంకులకు దూరంగా ఉండటానికి కారణమవుతోంది. అసంఘటిత కార్మికుల పిల్లలకు సరైన విద్య అందడం లేదు. రుసుములు, వ్యయాలు, ప్రయాణ భారాల కారణంగా చాలామంది చదువుకు దూరంగా ఉంటున్నారు. దేశంలో అసంఘిటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరిపించి నెలజీతాలు ఠంచనుగా వారి కాతాల్లో పడేలా చేస్తామని గతంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అసంఘటిత రంగంలోని దాదాపు 30కోట్ల మందికి పైగా కార్మికులకు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేవు. 2014 నుంచి జన్‌ధన్‌ యోజన అమలులోకి వచ్చిన తరవాత 25 కోట్ల మంది ఇందులో చేరారు. అసంఘటిత కార్మికులకు మాత్రం ఇది అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో వీరికి ఖాతాలతో పాటు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశించారు. ఆయా కంపెనీలు కూడా ఇక నేరుగా జీతం మొత్తాన్ని ఖాతాల్లో వేయాల్సి ఆగత్యం ఏర్పడుతుందని అనుకున్నారు. ఖాతాలు లేకపోవడం, గుర్తింపు లేకపోవడం వల్ల ఇపపటి వరకు వీరికి వైద్య సేవలూ అందడం లేదు. గుర్తింపు పత్రాలు, భవిష్యనిధి ఖాతాలు లేనందువల్ల కార్మిక రాజ్యబీమా ఆసుపత్రుల్లోనూ సేవలు పొందలేక పోతున్నారు. ఫింఛన్‌ సౌకర్యం చాలామందికి అందుబాటులో లేదు. పిల్లలకు ఉపకార వేతనాలు రావడం లేదు. ప్రమాదవశత్తూ మరణించినా, గాయపడినా సరైన సాయం అందడం లేదు. చికిత్సలకే పరిమితం చేసి ఇంటికి పంపిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పథకంగా జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం అమలులో ఉంది. కానీ, ఎండ, వాన, చలిలో శ్రమించే కూలీలకు కనీస వసతులు లేవు. తాగునీరు, నీడ, ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు తదితర కనీస వసతులు అందుబాటులో ఉంచాలని ఉపాధి హావిూ చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ అలా జరగడం లేదు. ఈ కార్మికులకు కనీస చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కార్మిక శాఖపై ఉంది.

 

Other News

Comments are closed.