ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా

share on facebook

సంగారెడ్డి,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని నారాయణఖేడ్‌ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గత పాలకులు రాష్ట్రంలో ఏ వర్గాన్ని పట్టించుకోకుండా స్వార్థరాజకీయాలు చేస్తూ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో సీఎం కేసీఆర్‌ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. ఖేడ్‌ నియోజకవర్గంలో రూ.80 కోట్లతో మిషన్‌ కాకతీయ పనులు చేపట్టి చెరువుల పునరుద్దరణ చేపట్టామన్నారు. పలుగ్రామాల్లో ఆయన ప్రచారం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీళ్లు అందించేందుకు ఏర్పాటు పూర్తి అయ్యాయన్నారు. త్వరలో ఇంటింటికీ తాగునీరు అందజేస్తామన్నారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని ఎరువులు, విత్తనాలు, విద్యుత్‌ సైతం అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన కరెంటు అందజేస్తూ రైతులందరికీ ట్రాన్స్‌పార్మర్లు అందజేశామన్నారు. రాష్ట్రంలోని రైతులకు రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేసేందుకు మ్యానిఫెస్టోలో ప్రకటించిందన్నారు. ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశామని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరో ఐదేండ్లు సేవకుడిలా పనిచేస్తానన్నారు. గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమానికి హాజరై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖేడ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి అవకాశమిచ్చేలా ఆశీర్వదించాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భూపాల్‌రెడ్డికి ఆయా గ్రామాల్లో ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి బొట్టుపెట్టి ఆహ్వానించారు.

 

 

Other News

Comments are closed.