ఆధార్‌ బాధితులకు భరోసా 

share on facebook

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం ఈ మధ్య రెండుమూడు తీర్పులను వెలువరించి సంచలనం సృష్టించింది. పాలకులు చట్టబద్దమైన విషాయలను చట్టబద్దం చేయకపోవడంతో ఇలాంటి చర్యలు తప్పడం లేదు. నేరమయ రాజకీయాలు, ఆధార్‌, ప్రజాప్రతినిధులుగా ఉన్న లాయర్ల విషయంలో సుప్రీం విస్పష్టమైన తీర్పును వెలువరించింది. నేరచరితులను రాజకీయాలనుంచి తప్పించేందుకు పార్లమెంట్‌ చట్టంచేయాల్సి ఉంది. దీనిని కేంద్రంలోని పార్టీలు అనుసరిస్తాయని భరోసాలేదు. ఇకపోతే ప్రధానంగా ఆధార్‌ విషయంలో స్పష్టతను ఇచ్చింది. అయినదానికీ కానిదానికి ఆధార్‌ను పెట్టా/-లసిన అసవరం లేదని తేల్చిచెప్పింది. పాన్‌కార్డుతో అనుసంధానం తప్పనిసరి చేసింది. వెలువరించాల్సిన కీలక తీర్పుల పరంపరలో ఒకటైన ఆధార్‌ కేసులో బుధవారం నిర్ణయం వెలువడింది. అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్‌ రాజ్యాంగ బద్ధతను ధ్రువీకరిస్తూనే దాని వినియోగంపై కొన్ని ఆంక్షలు విధించింది. అంతేకాదు, ఆధార్‌ లేదన్న కారణంగా పౌరులకుండే హక్కుల్ని నిరాకరించరాదని కూడా స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు  అసలు న్యాయస్థానం విధించిన పరిమితులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు అనేకానేక పథకాలకు ఆధార్‌ను విస్తరించుకుంటూ పోయాయి. బ్యాంకులకు ఆధార్‌ నమోదు తప్పినసరి చేశారు. దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల పౌరులకు అదనంగా ఒరిగిందేమిటి? ఆధార్‌ డేటా లీకైందని వార్తలు వెలువడి నప్పుడల్లా అది తమ దగ్గర జరగలేదని, ఫలానా సంస్థ వల్ల బయటికొచ్చిందని ప్రాధికార సంస్థ వివరణనిచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇకపై అది చెల్లదు. డేటా భద్రతకు అది బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకవసరమైన కట్టుదిట్టమైన నిబంధనల్ని ప్రభుత్వం ఎలా రూపొందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే  టెలికాం సంస్థలు సేకరించిన డేటాను రెండువారాల్లో తొలగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని ఆదేశించారు. మొత్తానికి పౌరుల వ్యక్తిగత గోప్యతను సుప్రీం కోర్టు పరిరక్షిస్తుందని ఎదురుచూసినవారికి ఈ తీర్పు నిరాశ కలిగిస్తుంది. ఆధార్‌ను ఎత్తిపడుతూనే సుప్రీంకోర్టు అధికులకు ఆమోదకరమైన తీర్పునిచ్చింది. రాజకీయ పక్షాలు తీర్పు బాగుందంటున్నాయి. సుప్రీంకోర్టు తమ వాదన నెగ్గించినందుకు కాంగ్రెస్‌, బీజేపీలు ధన్యవాదాలు తెలియచేస్తున్నాయి. ప్రైవేటు సేవలనుంచి ఆధార్‌ బాధ తప్పిపోతున్నందుకు ప్రజలు సంతోషిస్తున్నారు. ఆధార్‌ విశిష్ఠమైనదని, అట్టడుగు వర్గాలకు ఇది సాధికారత ఇచ్చిందని అంటూ ఈ కీలకమైన సమాచారాన్ని ప్రభుత్వానికి మాత్రమే పరిమితం చేయడం ద్వారా దాని ఇతరత్రా దుర్విని యోగానికీ, వ్యాప్తికీ సుప్రీంకోర్టు అడ్డుకట్టవేసింది. ఈ తీర్పుతో ఆధార్‌ను దాదాపుగా దాని ఆవిర్భావ లక్ష్యానికి సుప్రీంకోర్టు కుదించేసింది.  ప్రైవేటు సంస్థలు  డేటాను వినియోగించుకోవటానికి వీలు కల్పించే ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను ధర్మాసనం కొట్టేసినా ఇంతవరకూ టెలికాం సంస్థలు, బ్యాంకులు, డిజిటల్‌ పేమెంటు సంస్థలు సేకరించిన డేటా స్థితి ఏమిటో చెప్పలేదు. చట్ట ప్రాతిపదిక లేదు గనుకనే ఈ సెక్షన్‌ను కొట్టేస్తున్నామని ధర్మాసనం తెలి పింది.  ముఖ్యంగా పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఈ పథకం ముప్పు కలిగిస్తుందన్న అభిప్రాయంతో సర్వో న్నత న్యాయస్థానం ఏకీభవించలేదు. పైగా ఇప్పటికే దాదాపు వందకోట్లమంది పౌరులు నమోదై ఉన్నారు గనుక ఆధార్‌ను మొత్తంగా తోసిపుచ్చటం సాధ్యంకాదని తేల్చింది. ఆధార్‌ పరిధి నుంచి కొన్నిటిని ధర్మాసనం తప్పించినా సంక్షేమ పథకాలకు అది వర్తింపజేయటం సమంజసమేనని తెలిపింది. అలా వర్తింపజేయటంలో ఉన్న ఇబ్బందులు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినట్టు లేదు. వేలి ముద్రలు సరిపోలడం లేదంటూ అనేకమందికి రేషన్‌, పింఛన్‌, ఇతర పథకాలు నిరాకరిస్తున్నారు.
ఎన్నో విమర్శలు వచ్చాక, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాక అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆదరా బాదరాగా జాతీయ గుర్తింపు ప్రాధికార సంస్థ బిల్లును తీసుకొచ్చింది. తుది తీర్పు వెలువడే వరకూ పౌరులెవరికీ ఆధార్‌ను తప్పనిసరి చేయరాదన్న సుప్రీంకోర్టు… అనంతరకాలంలో దాన్ని సడలించుకుంది. ఇకపోతే అటు కేంద్రం, ఇటు కాంగ్రెస్‌ తదితర పక్షాలు సుప్రీంకోర్టు తీర్పు తమ విజయమంటే తమ విజయమని జబ్బలు చరుచుకోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏ కీలక అంశంపైన అయినా అధికారంలో ఉండగా ఒక విధంగా, విపక్షంలో ఉండగా మరొకలా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు.  ప్రధానంగా ఆధార్‌ చట్టబద్ధతను రక్షిస్తూనే, కొన్ని మినహాయింపులు ఇచ్చిన కారణంగా ఈ తీర్పు సగటు మనిషికి సంతోషాన్ని కలిగించవచ్చును కానీ, వ్యక్తిగత గోప్యత, నిఘా ఇత్యాది కీలకమైన అంశాల విషయంలో భయపడినవారికి తీర్పు విస్మయాన్ని కలిగిస్తున్నది. బ్యాంకు ఎకౌంట్లు, మొబైల్‌ సేవలు, ఉన్నత చదువులు, స్కూల్‌ అడ్మిషన్లు, ఎంట్రన్స్‌ పరీక్షలు ఇత్యాది అనేకానేక అవసరాలతో ఆధార్‌ను ప్రస్తుత ప్రభుత్వం చుట్టేసిన నేపథ్యంలో ఈ తీర్పుతో అనేకులకు ఆ బాధలనుంచి విముక్తి కలిగింది. పాన్‌కార్డు, ఆదాయపు పన్ను రిటర్నులకు మాత్రమే ఆధార్‌ను పరిమితం చేయడంతో అత్యధికులకు గొడవ తప్పింది. బ్యాంకు ఎకౌంట్లు ఆధార్‌తో ప్రత్యక్షంగా అనుసంధానం కాకున్నా, పరోక్షంగా అవి పాన్‌ నంబరుతో అనుసంధానమై ఉంటాయి కనుక కొత్తగా వచ్చేదీ పోయేదీ ఏవిూ ఉండదు. పనిలో పనిగా వందకుపైగా ప్రభుత్వ సంక్షేమ, సబ్సిడీ పథకాలతో ఆధార్‌ ఇప్పటికే అనుసంధానమై ఉన్న స్థితిలో ప్రభుత్వ వినియోగంపై మాత్రం ఆంక్షలు విధించకుండా వదిలేసింది. ఆధార్‌ కారణంగానే దేశవ్యాప్తంగా వేలాదిమంది ప్రభుత్వ కార్యక్రమాలకు, పథకాలకు, సబ్సిడీలకు దూరమై పోయారనీ, పేదలకు వాటిని దూరం చేసే పని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదని పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ఆధారాలతో సహా బయటపెట్టిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ తీర్పు కొంత ఉపశమనం కలిగించేదే.

Other News

Comments are closed.