ఆధ్యాత్మికం

share on facebook

అనందం ఎక్కడో లేదు

హైదరాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అసలు ఆనందానికి చిరునామా ఎక్కడో లేదు. నిన్ను నీవు ప్రేమించినట్లే పొరుగువారినీ ప్రేమించు ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని నలుగురికీ పంచిపెడితే అది రెట్టింపవుతుంది. సంతోషమే స్వర్గం, దుఃఖమే నరకం అని సుమతీ శతక కారుడు బోధించాడు. స్వర్గంలాంటి సంతోషం పొందాలంటే ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. ఉన్నస్థితిలోనే ఉన్నతంగా, సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి.పసిపిల్లలను గమనించండి. వాళ్ళు ఏం తింటున్నా, ఏ ఆట ఆడుతున్నా పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తారు. లేని హుందాతనాన్ని నటించరు. ముసుగులు వేసుకోరు. ఏ పని చేసినా ఉత్సాహంగా చేస్తారు. సముద్రాన్ని చూసినా, వర్షాన్ని చూసినా సంతోషంతో కేరింతలు కొడతారు. కాని మనిషి ఎంత అందమైన ప్రదేశంలో ఉన్నా పూర్తి ఆనందాన్ని అనుభవించడు. అప్పుడు కూడా ఆలోచనలతో కాలం వెళ్ళదీస్తాడు. గతం తాలుకు జ్ఞాపకాలతో, భవిష్యత్తు గురించి ఆందోళనలతో ఘర్షణ పడుతుంటాడు. వర్తమానంలో ఏ క్షణాన్నీ ఆనందంగా ఆస్వాదించడు. మనిషి ఆనంద స్వరూపుడిగా మారాలంటే జ్ఞాపకాల బరువును వదిలించుకోవాలి. భయాలకు, ఆందోళనలకు దూరంగా ఉండాలి.భారతీయ వాంగ్మయం మొత్తం నిజమైన సంతోషం కోసం మనిషి ప్రయత్నించాలని బోధిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ’నిన్ను నీవు తెలుసుకో’ అని ఉపదేశిస్తున్నాయి. ఆ బోధనను అర్థం చేసుకుంటే మనిషి అంతర్ముఖుడవుతాడు.మనిషి తాను జీవించి ఉన్న కొద్దికాలంలో తన బతుకు ఎవరికీ భారం కాకుండా మంచిని పూయించి, జీవన మకరందాన్ని ఆస్వాదించి, శాశ్వతమైన ఆనందం పొందేందుకు కృషి చేయాలి. అర్థశౌచం, అల్పసంతోషిత్వం, దయ, సానుభూతి వంటి సుగుణాలతో ముందుకు సాగే మనిషి సమస్థితిని సాధించి నిత్యానందంతో ఉంటాడు.

Other News

Comments are closed.