ఆధ్యాత్మికం

share on facebook

సంతోషమే జీవిత లక్ష్యం కావాలి

కుండలో చిక్కగా తోడుకున్న పెరుగులాంటిది జ్ఞానం. విచక్షణ అనేది చిలికే కవ్వం. కమ్మనైన చిక్కని మజ్జిగగా అప్పుడే రూపాంతరం చెందేది. ఇది నిరంతరమూ సాగాల్సిన క్రియ. ఎదురయ్యే ప్రమాదం, భయం, అమితమైన అలజడి కాలమేఘంలా ఈ క్రియను క్షణకాలం కట్టడి చేస్తాయి. సహజం. ఆ క్షణకాలాన్నీ తన అదుపులో ఉంచుకోగలిగినవారే జ్ఞానమూర్తులు.విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అయ్యేందుకు సుదీర్ఘ కాలమే పట్టింది. కోపతాపాలకు గురైనప్పుడు, పంతాలకు పట్టుదలలకు పోయినప్పుడు విచక్షణ కోల్పోవడం వల్లే తపశ్శక్తిని ఎంతో కోల్పోయాడు. ఈ ఉదంతాలు, ఉదాహరణలన్నీ మనకు గీతావాక్యాలు. సూర్యకిరణ కాంతులు సోకనిదే కమలాలు వికసించవు. విచక్షణ లేని జ్ఞానమూ భాసిల్లదు. విచక్షణతో జీవితాన్‌ఇన గడిపే బాగ్యం ఒక్క మానవమాత్రులకు మాత్రే దక్కింది. ఇంతటి భాగ్యం పశుపక్ష్యాదులకు లేదు. అందుకే మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు. సంతోషం కోసమే అన్నం తింటాడు. సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు. సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు, పిల్లలు కావాలనుకొంటాడు. చేసే ప్రతి పని అంతా సంతోషం కోసమే! డబ్బుతోనే సంతోషమన్న వ్యామోహంలో మానవుఉల ఉన్నారు. ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు. కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు. అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు. సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది. సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు.వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం. పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం. యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం. కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం. కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం. ఇలా

సంతోషానికి ఒక నిర్వచనం లేదు. ఒక ఉనికి లేదు. ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని. పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు. మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి. ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు. నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదనకోసం అర్రులు చాచకూడదు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి.

Other News

Comments are closed.