ఆసరా పెన్షన్ల కోసం నెలనెలా ఎదురుచూపులే

share on facebook

మహబూబ్‌నగర్‌,మే17(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు తోడు పూట గడుపుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆసరా పథకం లబ్దిదారులు హైరానా పడుతున్నారు. సకాలంలో పింఛన్లు అందడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఆధారం లేని వృద్ధులు, వికలాంగులు, వితంతులతోపాటు చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, కళాకారులకు పింఛను మంజూరు చేసి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. నెల నెలా మొదటి వారంలో పింఛను అందజేస్తేనే లబ్దిదారుల అవసరాలు తీరుతాయి. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధ పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా పంపిణీ చేయాల్సిన పింఛను ఎప్పుడు అందుతుందో తెలియక లబ్దిదారులు అయోమయానికి 
లోనవుతున్నారు. ఓ నెల మూడో వారం, మరో నెల నాలుగో వారం అందుతుండగా.. ఒక్కోసారి రెండు మూడు నెలలకోసారి పింఛను అందిస్తున్నారు. దీంతో నిత్యావసరాలను ఎలా తెచ్చుకోవాలని లబ్దిదారులు వాపోతున్నారు. ఇలా ప్రతి నెల పింఛను కోసం పడిగాపులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.  ప్రతి నెల 5వ తేదీ లోపు లబ్దిదారులకు పింఛను అందించాలని పింఛను సొమ్మును పెంచిన మొదట్లోనే ప్రభుత్వం సంబంధిత అధికారులు, ఆయా గ్రామాల కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే.. ఏ నెలలోనూ లబ్దిదారులకు 5వ తేదీ లోపు పింఛను అందిన దాఖలాలు లేవు. ఇటీవల బ్జడెటులో తెలంగాణ ప్రభుత్వం ఒకే సారి ఏడాదికి సరిపడా బ్జడెట్‌ను ఆసరా పింఛన్లకు కేటాయించింది. అయినా ప్రతినెలా రెండో వారం దాటితేగానీ పింఛను మంజూరు కావడం లేదు. ఈ కారణంగా లబ్దిదారులు పింఛను కోసం పడిగాపులు కాయక తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రతి నెలా 5వ తేదీలోపు పింఛను డబ్బును అందిస్తూ ఆదుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు.
…………………….

Other News

Comments are closed.