ఆ ముగ్గురే టార్గెట్‌!

share on facebook

– డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి, జానారెడ్డిలపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి
– ఏలాగైనా వారిని ఓడించేలా వ్యూహాలు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష పార్టీలు పొత్తు చర్చలతో కిందా విూద పడుతుంటే… అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది. ఓవైపు దూకుడు కొనసాగిస్తూనే మరోవైపు కాంగ్రెస్‌పై రాజకీయ దిగ్భంద వ్యూహానికి కేసీఆర్‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రంలోని మూడు నియోజక వర్గాలపై కేసీఆర్‌ గురిపెట్టినట్లు సమాచారం. టీకాంగ్రెస్‌ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రగతి భవన్‌ వేదికగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట. కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలుగా ఉన్న ముఖ్యనేతలంతా నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేతతో సై అంటే సై అంటున్న కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలతోపాటు జానారెడ్డిలాంటి వాళ్లు నల్గొండ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తమ్‌, కొమటిరెడ్డిల సంగతి పక్కనపెడితే జానారెడ్డిపైనే టీఆర్‌ఎస్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టినట్లు కనిపిస్తోంది. జానాపై నోముల నర్సింహయ్యను టీఆర్‌ఎస్‌ బరిలోకి దింపింది. ఈ స్థానంలో ఎలాగైన జానాను ఓడించేలా టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు షురూ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ సంగతికొస్తే ఈ జిల్లా టీఆర్‌ఎస్‌కు అంతగా కొరుకుడు పడలేదనే చెప్పాలి. రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల దిగ్గజనేతలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్నారు. మాజీమంత్రి డీకే అరుణ, రేవంత్‌ రెడ్డి, చిన్నారెడ్డిలతో పాటు స్థానికంగా ఉన్న యువనేతలు కూడా దూకుడుగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం చూపడంతోపాటు అటు టీఆర్‌ఎస్‌ పార్టీపైనా, కేసీఆర్‌ పైనే ఎదురుదాడి చేస్తున్న రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. అందులో భాగంగా రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఆయన అనుచరులు చాలా మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దానికి తోడు కొడంగల్‌కు కేసీఆర్‌ ప్రభుత్వం ప్రత్యేక వరాలు కూడా ఇచ్చింది. కొడంగల్‌లో గెలిచి, రేవంత్‌ రెడ్డి దూకుడుకు కళ్లెం వేయాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ అందుకోసం అనేక వ్యూహాలను విడతల వారీగా అమలు
చేస్తోంది. ఇందుకోసం పట్నం నరేందర్‌ రెడ్డిని రంగంలోకి దించారు. మరోపక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌కే చెందిన గద్వాల్‌ నియోజకవర్గంపై కూడా టీఆర్‌ఎస్‌ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌పై ఘాటుగా ఎదురుదాడి చేసే నేతల్లో డీకే అరుణ ముందుంటున్నారు. తెలంగాణలో బలమైన మహిళా నేతగా కూడా అరుణ తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీకి నూకలు చెల్లిపోయాయంటూ ముందునుంచే ఆమె సవాల్‌ విసరడం మొదలుపెట్టారు. గద్వాల నియోజక వర్గాన్ని ఈసారి ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థిగా బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిని బరిలోకి దింపింది. స్థానికంగా ఉన్నటీఆర్‌ఎస్‌ పార్టీ బలంతోపాటు అరుణ కుటుంబంలో ఉన్న రాజకీయ వైరుధ్యాలను కూడా క్యాష్‌ చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ ముగ్గురిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో కేసీఆర్‌ అనుచరగణానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Other News

Comments are closed.