ఈ తీర్పును మన సమాజం జీర్ణించుకునేనా?

share on facebook

వివాహేతర సంబంధాలపై సుప్రీం వెలువరించిన  తాజాగా తీర్పు ఓ రకంగా మన సమాజాన్ని ఓ కుదుపు కుదిపిందనే చెప్పాలి. కట్టుబాట్లు, బంధాలు, అనుబంధాలకు పెద్దపీట వేస్తున్న దేశం మనది. అనాదిగా మనదంతా కుటుంబ వ్యవస్థతో ముడిపడి ఉన్న దేశం. అసలు పరపురుషుడితో సంబంధం విషయం అనాదిగా మనదంతా ఒకటే భావంగా ఉంది. ఇదంతా స్త్రీని ఆరాధ్య దైవంగా, ఆదిశక్తిగా భావించే మనస్తత్వంతో ఉన్నాం. అందుకే మానవసంబంధాల విషయంలో మనకున్నన్ని కట్టుబాట్లు బహుశా మరే దేశంలోనో..మరే ఇతర మతాల్లోనో ఉండదు. ఇక్కడ మహిళకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజంగానే మనల్ని మనం చూసుకోవాలి. మహిళలను తల్లిగానో చెల్లిగానో, కూతురిగానో చూసుకునే అరుదైన సంప్రదాయం మనది. అయితే వివాహేతర సంబంధం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం  చేసిన దరిమిలా ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. మొన్నటికి మొన్న గే సంస్కృతికి జెండా ఊపిన సుప్రీం ఇప్పుడు వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణించే ఐపీసీలోని 497వ సెక్షను రాజ్యాంగ విరుద్ధమని, మహిళల గౌరవానికి భంగకరమని తన తీర్పులో పేర్కొంది. మన దేశంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాన్ని పరిశీలిస్తే,వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తోంది. ఇలాంటి కేసుల్లో పురుషుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.ప్రభుత్వ ఉద్యోగులకు జరిమానా  కూడా విధించే అవకాశం ఉంది. మహిళకు మాత్రం ఎలాంటి శిక్ష ఉండదు.మహిళలను పురుషుల ఆస్తిగా భావించే వారి పట్ల వివక్ష చూపే  ఈ 497 సెక్షన్‌ను రద్దు చేయాలని మహిళల జాతీయ కమిషన్‌ సిఫారసు చేసింది. పరస్పర సమ్మతితో జరిపే శృంగారం వారి వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని నేరంగా పరిగణించరాని ఆస్టేల్రియా చట్టం చెబుతోంది.వివాహేతర సంబంధం విడాకులకు ప్రాతిపదికగా పేర్కొనే నిబంధనను కూడా రద్దు చేసింది.20వ శతాబ్దం మధ్య వరకు ప్రపంచంలో చాలా దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగానే పరిగణించాయి. కొన్ని దేశాలు ఈ నేరానికి మరణ శిక్షను విధించాయి.అయితే తర్వాత కాలంలో వివిధ దేశాలు వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే చట్టాలను రద్దు చేశాయి. ఐరోపా దేశాల్లో ఇది నేరం కాదు. చాలా కమ్యూనిస్టు దేశాలు కూడా వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిం చడం లేదు. ఐరోపా దేశాల్లో వివాహేతర సంబంధానికి పాల్పడిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించేవారు. యురోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. మనదేశం నుంచి విడివడ్డ పాకిస్తాన్‌లో వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు 1979లో హుదూద్‌ ఆర్డినెన్సు జారీ చేసింది.అయితే,ఈ కేసులో పట్టుబడ్డ మహిళ తాను అత్యాచారానికి గురయ్యాయని స్వయంగా నిరూపించుకోవలసి ఉంటుంది. దానికి నలుగురు ప్రముఖుల సాక్ష్యం కూడా తప్పనిసరి.అలా చేయలేకపోతే ఆ మహిళను శిక్షిస్తారు. సౌదీ అరేబియా, బ్రూనే వంటి ఇతర ఇస్లాం దేశాల్లో కూడా ఇలాంటి చట్టమే అమల్లో ఉంది.ఆ దేశాల్లో వివాహేతర సంబంధం నేరానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం. అమెరికాలో 20వ శతాబ్దం మధ్య వరకు చాలా రాష్ట్రాలు  వివాహేతర సంబంధాన్ని నేరంగానే పరిగణిస్తూ వచ్చాయి. కాలక్రమంలో కొన్ని రాష్ట్రాలు ఆ చట్టాలను రద్దు చేశాయి. ఇకపోతే భారత శిక్షాస్మృతి 497వ సెక్షన్‌ వివాహేతర సంబంధాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటోంది.’మరొకరి భార్య అని తెలిసి, ఆ భర్త   అనుమతి లేకుండా ఆమెతో శృంగారం నెరపడం అత్యాచార నేరం కాకపోయినా, వివాహేతర సంబంధానికి సంబంధించిన నేరంగా పరిగణించబడుతుంది. ఆ నేరానికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష కాని, జరిమానా కాని లేదా రెండూ కాని విధించవచ్చు. ఇటువంటి కేసుల్లో భార్యను భాగస్వామన్న పేరుతో
శిక్షించడానికి వీలులేదని సెక్షన్‌ 497 స్పష్టం  చేస్తోంది. అయితే, ఈ చట్టం  ప్రకారం అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను కాని, భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళనుకాని ప్రాసిక్యూట్‌ చేసే హక్కు భార్యకు లేదు. మన దేశంలో 1956 నాటి హిందూ వివాహ చట్టంలోని 13(1) సెక్షను కింద వివాహేతర సంబంధాన్ని విడాకులకు ప్రాతిపదికగా పరిగణించవచ్చు. ఈ నిబంధనను 158 ఏళ్ల క్రితం అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఏకపక్ష, పురాతన నిబంధన అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మహిళలకు ఉన్న సమానత్వ హక్కు, సమాన అవకాశాల హక్కును హరించేదిగా ఉందని తెలిపింది. మహిళల హక్కును కాదనే నిబంధన రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రలతో కూడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తునే నాలుగు సెట్ల తీర్పులను వెలువరించారు.
కొన్ని శతాబ్దాలుగా వివాహేతర సంబంధాలను నేరమని పరిగణిస్తున్న మన సమాజం ఇప్పుడు దీనిని ఎలా స్వీకరిస్తుందన్నది ఓ ప్రశ్నగా ఇప్పుడు సమాజాన్ని ప్రశ్నిస్తుంది. వివాహేతర సంబంధాలలో అనేకులు దాడులకు తెగించి హత్యలు చే/-తున్న కాలమిది. స్త్రీ అంటే తన సొంతం అనుకునే సమాజంలో జీర్ణఙంచుకుని పోయాక ఈ చట్టం ద్వారా సమాజంలో వింత పోకడలకు ఆస్కారం ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు.

Other News

Comments are closed.