ఉగ్రగోదారి

share on facebook

– గోదావరికి భారీగా వరద నీరు
– భద్రాచలం వద్ద 47అడుగులకు చేరిన నీటిమట్ట
– మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
– పోలవరం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదారి
– తొమ్మిది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
– పడవల్లో ప్రయాణించవద్దని అధికారుల హెచ్చరిక
– ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
– అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరికలు
ఖమ్మం, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అంతకంతకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. మరోపక్క భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విలీన మండలాల్లో శబరినదికి వరద నీరు పోటెత్తింది. చింతూరు, వి.ఆర్‌.పురం, కూనవరం మండలాల్లో రహదారులు నీట మునిగాయి. దేవీపట్నం మండలంలోని సీతపల్లి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో గోదావరి తీరంవెంబడి ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు. అటు కోనసీమలోనూ గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు నాటుపడవలపై రాకపోకలు సాగించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరంలో 13 విూటర్లు మేర వరద ఉంది. సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. పోలవరం కడెమ్మ వంతెనపై గోదావరి నీరు చేరుకుంటోంది. కొత్తూరు కాజ్‌ వే పైకి ఐదు విూటర్లు నీరు చేరుకోవడంతో 19 గిరిజన గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు ప్రత్యేక లాంచీల్లో నిత్యావసర వస్తువులను ఆ గ్రామాలకు పంపుతున్నారు. వరద నీరు పోటెత్తడంతో పోలవరం ప్రాజెక్టు పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పాత పోలవరం, కమ్మరిగూడెం, నూతనగూడెం, కొత్త పట్టిసీమ, గుటాల, తదితర గ్రామాల్లో గట్లు బలహీనంగా ఉండటంతో ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేశారు.
ధవళేశ్వరం వద్ద ఉధృతంగా..
గోదావరి నీటి మట్టం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 9.6 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సముద్రంలోకి సుమారు 8,80,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిపరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా జీవనది గోదావరి నది వరద నీరు రహదారులపైకి చేరడంతో దాదాపు 30గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరద నీరు పెద్దఎత్తున రోడ్లపైకి చేరడంతో కోయిదా, కట్టుకూరు, ఎడవల్లి, తేలపల్లి, చిగురుమామిడి, తూర్పుమెట్ట,
తిర్లాపురం, దాచేపల్లి గ్రామాలతోపాటు 30 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.
కృష్ణమ్మ పరవళ్లు..
మరోవైపు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు కృష్ణమ్మసైతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలోకి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 3.11 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం పూర్థిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 876.9 అడుగులకు చేరుకుంది. జలాశయంలో నీటి నిల సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 176 టీఎంసీలుగా ఉంది. అడుగులకు చేరుకుంది. లక్ష క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 79 వేల క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తుండగా మిగతాది పోతిరెడ్డుపాడు, హంద్రీనివా ప్రాజెక్టులకు విడుదల చేశారు.

Other News

Comments are closed.