ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు

share on facebook

సిమ్లా, సెప్టెంబర్ 24: పలు ఉత్తరాది రాష్ర్టాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, మంచుతుఫాను బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షం సంబంధిత ఘటనల్లో 25 మంది మృతిచెందగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఎనిమిది మంది, పంజాబ్‌లో ఆరుగురు, జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు, హర్యానాలో నలుగురు, ఉత్తరాఖండ్‌లో ఇద్దరు మృతి చెందారు. పంజాబ్, హిమాచల్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రెండు రాష్ర్టాల్లో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో చార్‌ధామ్ యాత్రకు ఆటంకాలు ఏర్పడ్డాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్, యమునోత్రి వైపు వెళ్లే రహదారుల్లో కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గాలను మూసివేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో సోమవారం కొన్ని గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో వానాకాలం పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. పంజాబ్, హిమాచల్‌లో సైన్యం, వైమానిక దళాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.

హిమాచల్‌లో ఆకస్మిక వరదలు

హిమాచల్‌లోని పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. రావి, బియాస్ నదులు పోటెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పర్యాటక ప్రాంతమైన మనాలీకి జిల్లా ప్రధాన కేంద్రం కులూతో సంబంధాలు తెగిపోయాయి. వరదల ఉద్ధృతికి వాహనాలు, ఇండ్లు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో ఎనిమిది మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో ఐదుగురి మృతి

జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. మరో 24 గంటల పాటు అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

Other News

Comments are closed.