ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

share on facebook

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష: జోగు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని పార్టీలతో కూటమి కట్టినా భంగపాటు తప్పదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహా వారికి చెప్పుకోవడానికి బలమైన అంశాలేవీ కనిపించడంలేదన్నారు.తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే ఎలా ముందుకు వెళ్లాలనే అంశంలో కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు స్పష్టమైన వైఖరి లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో టీఆర్‌ఎస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సోమవరాం పలువురు మంత్రి జోగును కలిసి అభినందించారు. రాబోయే ముందస్తు ఎన్నికల్లో మంత్రి జోగు రామన్న భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని అన్నారు. మంత్రి రామన్నకు టికెట్‌ ఖరారు కావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందిస్తున్నారు. నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా ఈ ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తామని అన్నారు. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థులు ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతీ కుటుంబానికీ ఏదో ఒక రూపంలో ప్రయోజనాన్ని చేకూర్చాయి. ఈ విషయాన్ని కూడా ఆయా కుటుంబాలవారు ఆలోచన చేసుకునే విధంగా, టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచే విధంగా కలుసుకొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. మళ్లీ కేసీఆర్‌నే సీఎంగా చేయడం ద్వారా మరింత ప్రగతిని, సంక్షేమాన్ని పొందేందుకు సహకరించాలనే రీతిలో ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి కార్యక్రమాల పరంపర నిరంతరం కొనసాగాలనే ఆలోచనతోనే ఎన్నికల బరిలో నిలవడంతో జిల్లా వ్యాప్తంగా గులాబీ తనదైన వేగంతో దూసుకుపోతుండగా, ప్రతిపక్ష పార్టీలు అస్పష్టమైన వైఖరులతో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.

Other News

Comments are closed.